in ,

అర్ధం లేని రష్యా – ఉక్రెయిన్ వార్… అంతమెప్పుడో!

కరోనా తర్వాత రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడి దుడుకులను ఎదుర్కొన్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడులకు పాల్పడుతుందని హెచ్చరికల మధ్య ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్ లో సైనిక చర్య చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ప్రకటించారు. అప్పటినుండి సాగుతున్న యుద్ధం నెలలు గడుస్తున్నా ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి.

నాటో కూటమితో ఉక్రెయిన్ సన్నిహితంగా ఉండడమే రష్యా సైనిక చర్య చేపట్టడానికి ప్రధాన కారణం అని విశ్లేషకుల అభిప్రాయం. ఉక్రెయిన్ కు నాటో కూటమి భారీగా ఆయుధ, సైనిక, ఆర్ధిక సాయం అందించటం రష్యా దూకుడుకు కళ్లెం వేసింది. అమెరికా సహా పశ్చిమ దేశాల నుండి ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలు అందాయి.

ఇప్పటికే రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ భారీ నష్టాల్ని చవిచూసింది. అయితే పాశ్చాత్యదేశాల అండతో కాస్తో కూస్తో పోరాడుతున్న ఉక్రెయిన్ కూడా ఈ యుద్ధాన్ని మరెంతో కాలం భరించే పరిస్థితి లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై  ఐరాస భద్రతామండలిలో ఐరోపా, విదేశాంగ వ్యవహారాల ఫ్రెంచ్ మంత్రి కేథరీన్ కొలోనా అధ్యక్షతన 15 మంది సభ్యుల సంఘంలో జరిగిన చర్చలో రష్యా తన సైనిక చర్యను ముగించాలని భారత్ బలంగా పిలుపునిచ్చింది. చర్చలతో దౌత్యానికి తిరిగి రావాలని భారత్ గట్టిగా కోరుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి సంఘర్షణ పరిస్థితులలో కూడా మానవ హక్కుల, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనను సమర్థించలేమన్నారు. అటువంటి చర్యలు ఏవైనా జరిగినప్పుడు వాటిని నిష్పాక్షికంగా, స్వతంత్రంగా దర్యాప్తు చేయడం అత్యవసరమని చెప్పారు.

ఉక్రెయిన్ -రష్యా మధ్య యుద్ధం తప్పించడానికి

మార్గాలు:

చాలామంది దౌత్యవేత్తలు ‘ఆఫ్ ర్యాంప్’ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇది యుద్ధంగా మారకుండా చేయడానికి అన్నిపక్షాలూ ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ అదంత సులభం కాదనిపిస్తోంది. యుద్ధం జరిగితే దానివల్ల ఆర్థికంగా కలిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల దౌత్యపరంగా ఎదురుదాడి కూడా తీవ్రంగా ఉంటుంది. వీటన్నింటినీ భరించడం

రష్యాకు అంత సులభమేం కాదు. కానీ, ఇలాంటి పరిణామాలే తలెత్తితే, యుద్ధరంగంలో రష్యా విజయం సాధించినా, దానికి అర్ధం లేకుండా పోతుందని పుతిన్ ఆలోచించేలా చేయాల్సుంటుంది.

అలాంటి పరిస్థితుల్లో ఆయన కొన్నాళ్లపాటు ఈ యుద్ధానికి అయ్యే ఖర్చును భరించడం కష్టం కావచ్చు. అలా జరిగితే తన దేశంలోనే పుతిన్ కు మద్దతు తగ్గిపోతుంది. తర్వాత ఆయన నాయకత్వానికే సవాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ఒక విధంగా ఇక్కడ రష్యా ఆధిపత్యం కనిపిస్తోంది. ఉక్రెయిన్, నాటో వర్సస్ రష్యా ఉద్రిక్తతలు బెలారుస్ రాజధాని మింస్క్ లో 2014, 2015లో జరిగిన ఒప్పందాలను పునరుద్ధరించేలా చేయవచ్చు. ఉక్రెయిన్ సైన్యం, రష్యా మద్దతున్న తిరుగుబాటుదారుల మధ్య పోరాటానికి తెర దించడానికి ఈ ఒప్పందాలు జరిగాయి. ఆ ప్రాంతంలో శాంతి కొనసాగేలా ఆ ఒప్పందాలను పునరుద్ధరించాలని పశ్చిమ దేశాల నేతలు కోరుకుంటున్నారు.

ఈ ఒప్పందాలు జరిగితే అన్నిటికంటే తమ దేశమే ఎక్కువగా రాజీ పడాల్సి ఉంటుందేమోనని ఉక్రెయిన్ ప్రజలు భయపడుతున్నారు.

ప్రస్తుతం అందరిలో ఒకే ఒక ఆశ మిగిలుంది. అన్ని పక్షాలూ చర్చల కోసం రాజీ అయినట్లు కనిపించడమే ఆ ఆశ. ఇప్పుడు ఆ ఆశ మిణుకు మిణుకు మంటున్నప్పటికీ, ప్రారంభ చర్చల్లో ఏ పరిష్కారమూ లభించకపోయినా, అన్ని పక్షాలూ ఎంత ఎక్కువగా చర్చలు జరిపితే, ఈ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనే అవకాశాలు కూడా అంతే బలంగా ఉంటాయి.

What do you think?

అమేజింగ్ & మిస్టీరియస్ మౌంటైన్స్ ఆఫ్ ది వర్ల్డ్!

ఆలోచనే ఆయుధంగా ఎదిగిన వ్యక్తి “లతా చౌదరి”