in

ఒక రూపాయితో జరిగిన మిరాకిల్ – కథ

మిరాకిల్

విక్రమ్ 7 ఏళ్ల వయసులో అమ్మ చనిపోయింది. ఎందుకు చనిపోయింది అని విక్రమ్ అడిగితే ఎవరి దగ్గరా సమాధానం లేదు.

ఎలా చనిపోయింది అంటే సమాధానం ఉంటుంది కానీ ఎందుకు చనిపోయింది అంటే ఎవరైనా ఏం చెప్పగలరు.ఆ సమయంలో విక్రమ్ వంటరి వాడైపోయాడు. తనకి అమ్మలా చూసుకునే నాన్న ఉన్నాడు. కానీ అమ్మ స్పర్శని తను ఇవ్వలేడు కదా.

ఆ అమ్మ స్పర్శ కోసం విక్రమ్ ప్రతి క్షణం తపిస్తున్నాడు. మరో సారి అమ్మని కలవాలని, తనతో తన మనసులో మాటలు పంచుకోవాలని కోరుకుంటున్నాడు. కానీ ఒకసారి పోయిన ప్రాణం మళ్ళీ రాదని ఆ 7 ఏళ్ల పిల్లాడికి ఎవరు చెప్తారు. చెప్పినా తను ఎలా అర్ధం చేసుకుంటాడు.

* * * * * *

నెలలు గడిచాయి. విక్రమ్ మనసులో అమ్మను కలవాలనే కోరిక రోజు రోజు పెరుగుతుందే కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. అమ్మ చనిపోయినప్పటి నుండి విక్రమ్ ప్రతి రోజూ గుడికి వెళ్లి మరో సారి అమ్మను చూడాలని కోరుకుంటూనే ఉన్నాడు.

ఆ సమయంలో ఒక రోజు విక్రమ్ స్కూల్లో టీచర్ ఓ కథ చెప్పింది.

ఆ కథ 22 ఏళ్ల రఘు అనే ఓ కుర్రాడి కథ. అతను తెలివైన వాడు, చురుకైన వాడు. చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. తన కుటుంబానికి డబ్బు ఎప్పడూ ఒక సమస్య కాలేదు. తిని ప్రశాంతంగా బతకడానికి కావల్సినంత డబ్బు ఉంది రఘు వాళ్ళ కుటుంబం దగ్గర. వాళ్ళకి గట్టిగా 10 నిమిషాలు ఆలోచించేంత పెద్ద సమస్యలేమీ లేవు అప్పటి వరకు.

కానీ ఒక రోజు తను ఎంతో ఇష్టపడే చెల్లి ఏదో ఓ అరుదైన అనారోగ్యంతో బాధ పడుతుందని తెలిసింది. అది డబ్బు ఖర్చు పెడితే నయం అయిపోయే అనారోగ్యం కాదు. దాన్ని తగ్గించే మొందు ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. తను ఎక్కువ రోజులు బ్రతకదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు.

ఈ విషయం తెలుసుకున్న రఘు గుండె బాధతో బరువై పోయింది. దైర్యం చెప్పే అమ్మానాన్నలు కూడా చిన్న పిల్లల్లా ఏడుస్తుంటే వాళ్ళకి వయసులో చిన్నోడైన రఘుకి భయం వేసింది. వెంటనే ఇంటి నుంచి బయటకి వచ్చేశాడు. తల దించుకుని కళ్ళలో కన్నీళ్లతో నడవడం మొదలు పెట్టాడు. అలా ఉదయం మొదలైన నడక చీకటి పడేంత వరకు సాగింది. చివరికి రఘు నడక ఊరి చివర ఉన్న ఓ చిన్న చెరువు దగ్గర ఆగింది. ఇక నడవలేక అక్కడే చెరువు పక్కన నేలపై కూర్చుని పోయాడు. ఆ చెరువును, అస్తమిస్తున్న సూర్యుడ్ని చూస్తూ.

ఆ సమయంలో రఘుకి ఊళ్ళో ఎప్పుడూ వినిపించే మాట ఒకటి గుర్తుకొచ్చింది. అదేంటంటే ఊరి చివర ఉన్న ఈ చెరువులో డబ్బులేసి ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది. ఈ మాటల్ని పిచ్చి మాటలని చాలా మంది అన్నా.. ఆ క్షణంలో రఘుకి అవి పిచ్చి మాటల్లా అనిపించలేదు. రఘు వెంటనే తన జేబులో ఉన్న ఒక రూపాయిని తీసి తన చెల్లికి నయం కావాలని కోరుకుంటూ చెరువులో వేశాడు.ఆ తరువాత ఇంటికెళ్లి రాత్రంతా తన చెల్లినే చూస్తూ తన పక్కనే ఉన్నాడు.

రెండో రోజు రఘు చెల్లికి మరో సారి టెస్ట్స్ చేయిస్తే తనకి ఏ అనారోగ్యం లేదని డాక్టర్లు చెప్పారు. ఆ మాట వింటూనే రఘు మనసు ఆనందంతో నిండిపోయింది. రఘుకి ఇది ఒక మాయలా, ఒక అద్భుతంలా అనిపించింది.

* * * * * *

టీచర్ చెప్పిన ఈ కథ విన్న విక్రమ్ స్కూల్ నుంచి ఇంటికి రావడమే బ్యాగ్ ఇంట్లో పడేసి పరుగు తీశాడు. రోడ్డు మీద వెళ్తున్న జనం, ఆగకుండా వెళ్తున్న బళ్ళు ఇవేమి పట్టకుండా పరుగెడుతున్నాడు. ఊపిరి పైకి తన్నుతున్నా.. వంటినిండా చమటలు కారుతున్నా.. పట్టకుండా పరుగెడుతున్నాడు. చివరికి తను చేరుకోవాలనుకున్న గమ్యం చేరినాక, అప్పుడు కదులుతున్న కాళ్ళని ఆపి ఒక్కసారి చుట్టూ చూశాడు. తన కళ్ళ ముందు తనలో సూర్యుడ్ని కలిపేసుకుంటున్న ఓ చెరువు ప్రశాంతంగా కనిపించింది.
దాని గట్టు మీద నిల్చుని విక్రమ్ తన షర్టు జేబులో ఓ రూపాయి తీసి కళ్ళు మూసుకుని తన మనసులో ఉన్న కోరిక ఆ చెరువుని తీర్చమని కోరి, రూపాయిని చెరువులోకి విసిరాడు.

ఆ తరువాత తన మొహంలో తను కోరుకున్న కోరిక తీరుందనే నమ్మకం, దాని వల్ల వచ్చిన చిన్న నవ్వు కనిపించింది.

ఆ తరువాత నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.

* * * * * *

ఆ రోజు రాత్రి 2 గంటల మధ్య సమయంలో ప్రశాంతంగా పొడుకున్న విక్రమ్ చెంప మీద ఎవరో చెయ్యి పెట్టి నెమ్మదిగా నిమురుతున్నట్లు అనిపించింది. ఆ చెయ్యి స్పర్శ విక్రమ్ కి అచ్చు అమ్మలాగే అనిపించింది.
నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళ ముందు అమ్మ కనిపించింది. ఒక్కసారిగా విక్రమ్ కి పట్ట రానంత సంతోషం కలిగింది. వెంటనే అమ్మని హత్తుకున్నాడు. తనూ ప్రేమగా హత్తుకుంది. ఆ తరువాత విక్రమ్ ఇన్ని రోజులూ అమ్మకి చెప్పాలని చెప్పలేక దాచుకున్న విషయాలన్నీ అమ్మతో పంచుకున్నాడు.

ఆ రాత్రంతా అమ్మతో నవ్వాడు, అమ్మ కోసం ఏడ్చాడు. గట్టిగా హత్తుకున్నాడు. లెక్క లేనన్ని ముద్దులు పెట్టుకున్నాడు. అల్లరి చేశాడు, అమ్మని నవ్వించాడు. ఆ క్షణంలో అమ్మను చూస్తుంటే విక్రమ్ కి అది ‘మిరాకిల్’ లా అనిపించింది. ఆనందం తన మొహంలో మెరిసింది.

What do you think?

11 Points
Upvote Downvote

తెలంగాణా గాయకుడు గద్దర్ ఇక లేరు

వారికి రూ. 5 లక్షలు ఇవ్వనున్న ఏపీ సీఎం జగన్!