in

కనుమరుగవుతున్న తెలుగు నాటకం… సురభి.

కనుమరుగవుతున్న తెలుగు నాటకం… సురభి.

సురభి నాటకాల గురించి తెలుగువారికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 133 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ నాటక సమాజం అందరికీ సుపరిచితమే.

సురభి కుటుంబం చరిత్ర చెప్పాలంటే.. 1880కి వెళ్లాల్సిందే.

ఆ సమయంలో బ్రిటిష్ వారి వద్ద సైనికులుగా కొందరు, తోలుబొమ్మలాటలు, గారడీ విద్యలతో మరికొందరు జీవనం కొనసాగించేవారు. ఆ తోలుబొమ్మలాటలు ఆడేవారే తర్వాతి కాలంలో నాటక ప్రదర్శనల వైపు మళ్లి సురభి వారిగా గుర్తింపు పొందారని ‘తెలుగు నాటక వికాసం’ పేరుతో పీఎస్ఆర్ అప్పారావు రాసిన పుస్తకంలో వివరించారు.

ఇప్పటి తరానికి సురభి నాటకాలు పెద్దగా తెలియక పోవచ్చుగానీ, ఒకప్పుడు వినోదానికి చిరునామా సురభి. మనదేశంలో 1913లో వచ్చిన మూకీ సినిమా రాజా హరిశ్చంద్ర కన్నా, 1932లో వచ్చిన మొట్టమొదటి పూర్తి నిడివి తెలుగు చిత్రం భక్త ప్రహ్లాద కన్నా చాలా ముందు నుంచే అంటే 1885లో ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం, వైఎస్ఆర్ (అప్పటి కడప జిల్లా సురభి గ్రామంలో ‘కీచక వధ’నాటక ప్రదర్శనతో సురభి ప్రస్థానం మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు శ్రీ వనారస గోవిందరావు.

నాడు ….
1885లో కడప జిల్లాలోని సురభి అనే మారుమూల గ్రామంలో ఆ ఊరి పెద్దలైన చెన్నారెడ్డి, రామిరెడ్డిల ఇంట్లో పెళ్లి సందర్భంగా “కీచక వధ” అనే నాటకంతో సురభి నాటక ప్రస్థానం ప్రారంభమైంది.. కాగడాలు, దీపాల వెలుగుల్లో నాటకాలను ప్రదర్శిస్తున్న ఆ రోజుల్లో సురభి వారు తమ మొదటి ప్రదర్శనలో కిరోసిన్ లైట్లను వినియోగించారు. పెళ్లి వారింటి చీరలు, సెట్టింగ్ కోసం దుప్పట్లను, ఆకట్టుకునే దుస్తులను, నగలను ఉపయోగించి నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరణ పొందారు.

ఆనాడు వాళ్లు నాటక ప్రదర్శనలో చూపించిన సాంకేతికతే సురభి సమాజం ఇన్నేళ్లు కొనసాగడానికి, సురభి ఖ్యాతి వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథలు చెబుతూ, పాటలు పాడుతూ అందుకు తగ్గట్టుగా తోలు బొమ్మలను ఆడిస్తూ ఉండే వారి నైపుణ్యమే తరువాతి కాలంలో నాటక ప్రదర్శనలకు ఉపయోగపడింది.

ఈ సంవత్సరం లోనే వనారస సోదరులు వనారస గోవిందరావు మరియు వనారస చిన్నరామయ్య కలిసి వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలంలోని సురభి రెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారంభించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణ ‘సురభి నాటక సంఘం’గా పేరు పొందింది. స్థాపించిన కొద్దిరోజులలోనే ఈ సమాజం త్వరితగతిన విస్తరించి 50 వేర్వేరు బృందాలుగా వృద్ధి చెందింది. ప్రతి బృందం దాదాపు 30 మందికి పైగా సభ్యులతో స్వయం సమృద్ధితో నడుస్తూ ఉండేది. 1974లో సినిమా మరియు టీవీల ప్రవేశంతో, సురభి బృందాల సంఖ్య 16కు క్షీణించింది. 1982 నాటికి కేవలం నాలుగు సురభి నాటక బృందాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ప్రస్తుతం సురభి నాటక కళాసంఘం ఆధ్వర్యంలో అతి తక్కువ నాటక బృందాలు మాత్రమే పనిచేస్తున్నాయి.

నేడు….
కాల గమనం లో టీ వీ లు, సినిమా లు, ఓ టీ టి ల రాకతో సురభి నాటకానికి ఆదరణ తగ్గింది. కళాకారులకు ఉపాధి కరువైంది. నాటక ప్రదర్శనలు బాగా తగ్గిపోటం తో ఇతర ఉపాది మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి.

తెలుగు నాట ఘన చరిత్ర కల్గిన ఈ నాటకం మనుగడ ప్రశ్నార్ధకం గ మారిన నేపథ్యం లో పూర్వ వైభవం తెచ్చేందుకు ఆంధ్ర సారస్వత పరిషత్ ద్రుష్టి పెట్టింది.
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ లో శ్రీ వేంకటేశ్వర నాట్య మండలి (సురభి) వారి నాటక ప్రదర్శనలు శని, ఆదివారాల్లో సాయంత్రాలు జరుగుతున్నాయి. టికెట్ ఎంతో తెలుసా? కేవలం రూ.30/- లు. మాత్రమే. నాటకం చూడడానికి ఆయా రోజుల్లో సుమారుగా ముప్పై మంది ప్రేక్షకులు వస్తారట. రూ. 30 × 30 = రూ. 900 లు. ఈ కరువుకాలంలో దాంతో బతగ్గలమా? రోజూ విద్యుత్ దీపాల వెలుగులో ప్రదర్శనలు చేసే ఈ కళాకారుల జీవితాల్లో అంత వెలుగు లేదు. అనేక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు కేవలం కళను (సురభి) బతికించుకోవాలన్న తపన వాళ్లను బతికిస్తోంది. వందలు ఖర్చు పెట్టి మల్టీ ప్లెక్స్ ల్లో మసాల సినిమాలు చూసి, ఫేస్ బుక్ లో ‘చెత్త’ అని కామెంట్లు పెట్టే బదులు, మన సంసృతికి ఆలవాలంగా నిలిచే సురభి నాటక కళను ప్రోత్సహించండి.

సురభి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లి వద్ద ఇళ్ల స్థలాలు ఇచ్చింది. అక్కడ కొందరు. ఇళ్లు కట్టుకున్నారు. వారు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి (సురభి)లో రోజూ నాటకాలు వేస్తుంటారు. దాంతో రోజూ లింగంపల్లికి వెళ్లిరాలేక కొందరు పబ్లిక్ గార్డెన్స్లోనే తాత్కాలిక షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు సురభి నాటకాల ప్రదర్శనకు సరి అయిన వేదిక లేకపోవటమే ప్రధాన లోపం గ గుర్తించిన కళాకారులు, కళాభిమానులు ప్రభుత్వానికి చెందిన కళావేదికల పై అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పట్టణాల్లో ప్రత్యేకంగా నాటకాల ప్రదర్శనకు వేదికను ఏర్పాటు చేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నారు.

సంచార జాతులుగా ఉన్న సురభి కళాకారుల్ని రాష్ట్రము లో బిసి జాబితాలో చేర్చిన కేంద్రం ఓ బిసి గ పరిగణించడం లేదని కళాకారులు వాపోతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోటం తో పాటు కేంద్ర పథకాలకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం అందించి నాటకాలను బతికించటం ద్వారా సురభి నాటక సమాజానికి పునర్వైభవాన్ని తీసుకురావాలని కళాకారులు కోరుకుంటున్నారు.

సినిమా, టెలివిజన్, అంతర్జాలం ఎంత విస్తరించినా.. నాటక ప్రదర్శనలనే నమ్ముకొని జీవిస్తున్న ఏకైక కుటుంబం సురభి. తెర వెనుక ఎన్ని కష్టాలున్నా… రంగస్థలంపై నవ్వుతూ నవ్విస్తూ సురభి కళాకారులు నాటకాన్ని రక్తి కట్టించేవారు. అలాంటి కళాకారులపై గోరుచుట్టపై రోకలిపోటు మాదిరిగా మారిన కరోనా మహమ్మారి… వారి జీవితాలను కకావికలం చేసింది. నాటక ప్రదర్శలు కరవై.. చేతుల్లో చిల్లి గవ్వలేక అల్లాడుతున్న వారిని మరింత కుంగదీసింది.

ఘనమైన చరిత్ర కల్గిన సురభి కళావైభవాన్ని నేటి తరం ఆధునిక సాంకేతికత సహాయం తో ముందుకు తీసుకెళ్తుంది.

కరోనా వెంటాడిన లాక్ డౌన్ ఆంక్షలతో ఆకలి కేకలు వినిపించినా తమ ఆలోచనతో కళను బతికించుకుంటున్నారు. ఆన్లైన్ లో నాటకాలు ప్రదర్శిస్తూ కళాకారులకు అండగా నిలుస్తున్నారు. త్వరలో ఓ టి టి వేదికగాను ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

మన సంస్కృతీ సంప్రదాయంలో భాగమైన సురభి నాటక
కళను మనం బతికించుకోవాలి!.
సురభి కళాకారులను ఆదరించి, ప్రోత్సహించాలి!!

What do you think?

గుంతలు కాదు.. ప్రాణ గండాలు..ఇవి రాకాసి రహ”దారుణాలు

పత్తా లేని క్యాడర్….. తెలుగు దేశం పార్టీ