in ,

పత్తా లేని క్యాడర్….. తెలుగు దేశం పార్టీ

పత్తా లేని క్యాడర్….. తెలుగు దేశం పార్టీ

ప్రస్తుతం ఏపీ లో నెలకొన్న విపత్కర పరిస్థితులను అధికార పార్టీ వైసీపీ సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ఇలా అందరిని ప్రజాసేవలో నిత్యం ఉండేలా జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారం చేపట్టడం తెలుగు దేశం పార్టీ కి తప్పని సరి అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మళ్లీ ఓడితే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది.అందుకే అధినేత చంద్రబాబు నాయుడు కాళ్లకు చక్రాలు కట్టుకుని.. విరామం లేకుండా పార్టీ కోసం ఈ వయసులోనూ ఎంతో కష్టపడుతున్నారు. తాను మారానని.. అందరూ మారాలని కోరుతున్నారు. కొత్త వ్యూహాలతో నేతల్లోనూ, కార్యకర్తల్లోను ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్థానికంగా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. అధినేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం అయిపోవడంతో పార్టీ కేడర్ ను ముందుండి నడిపించే నాయకులు కరువయ్యారు. దీంతో మెజార్టీ టీడీపీ నేతలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్రస్థాయిలో మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు పొందినవారు, మాజీ ఎమ్మెల్యేలు, ఇలా ఎవరికి వారు తమకు ఎందుకు వచ్చింది లే అన్నట్టుగా దూరం దూరం గా ఉంటున్నారు.

దీంతో కిందిస్థాయి కార్యకర్తలలోనూ నిస్తేజం అలుముకుంది.. స్థానిక సంస్థల్లో టిడిపి తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులు మాత్రమే అక్కడ అక్కడ జనాలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగతా వారంతా పూర్తిగా కాడి వదిలేశారు.

ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. పార్టీకు కేడర్ ఉన్నప్పటికీ నేతల్లో చలనం లేకపోవడం కార్యకర్తల్లో నైరాశ్యం పెరిగిపోతుంది.

జగన్ పై బురదజల్లేలా ఏదో రకంగా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నా ప్రజలు ఏ మాత్రం ఆహ్వానించడం లేదు.. నాడు వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు అనేక మార్గాలను అన్వేషించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడం.. ప్రజలు అన్నివిధాలుగా ఇబ్బందులకు గురికావడం ఇలా అన్నీ జగన్ కు ప్లస్ అయ్యాయి.

ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్ర లో వైసీపీకు పూర్తిగా అనుకూల గాలులు వీస్తున్నాయనే చెప్పాలి.. ఒక వైపు రాజధాని ప్రకటన, మరో వైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కదలిక.. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూల పరిస్థితులుగా ఇక్కడ వైసీపీ నాయకుల్లో జోష్ ను పెంచుతున్నాయి. దీనికి తోడు వెల్లువులా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు మరింత రెట్టింపు ఉత్సాహాన్ని తెస్తున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు బయటకి రావడానికి ఇష్టపడడం లేదు.. ఏదో తమ అధినేత మాట జవదాటకూడదని తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారే తప్ప అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు.

టీడీపీ కు స్తంబాలుగా ఉత్తరాంధ్ర లో పూసపాటి అశోక్ గజపతిరాజు, గంటా శ్రీనివాసరావు, సుజయకృష్ణరంగారావు, కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు.. రెండు పడవులపై ఒకే సారి ప్రయాణం అన్నట్లు గంటా నోరు కూడా మెదపడం లేదు.. విజయనగరం నుంచి కీలక నేతలు, పూసపాటి అశోక్ గజపతిరాజు, సుజయకృష్ణరంగారావులు అసలు తమ తమ కోటలు నుంచి బయటకే రావడం లేదనే విమర్శలు అక్కడి కేడర్ నుంచి బలంగా వినిపిస్తున్నాయి.. ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉంటూ నిత్యం అభిమానులను, కార్యకర్తలను చైతన్య పరుస్తూ ఉండే ఆ జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ శోభా స్వాతి రాణి దంపతులు విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ లో చేరడంతో టీడీపీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. వీళ్ల చేరికతో అసలు పార్టీ కార్యక్రమాలు చేసేవారే కరువయ్యారని వినికిడి..

మరి శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన నేతగా ఉన్న అచ్చెన్నాయుడు అవినీతి ఆరోపణ కేసుల్లో ఇరుక్కుపోవడంతో ఇప్పటిలో మాట్లాడలేని పరిస్థితి…దీనికి తోడు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ బలం క్రమంగా పుంజుకోవడంతో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొత్తానికి జగన్ దెబ్బకి ఉత్తరాంధ్రలో సైకిల్ స్పీడ్ పూర్తి స్థాయిలో తగ్గిందనే చెప్పాలి..

సాధారణంగా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం. కానీ ఆయన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు మాత్రం ఆయన్ను కలుపుకుపోవడంలేదు. ముఖ్యంగా విడుదల రజని (చిలకలూరిపేట), బొల్లా నాయుడు (వినుకొండ)తో ఆయనకు నిత్యం వివాదాలు ఎదురవుతున్నాయి. ఇతర ఎమ్మెల్యేలు కూడా అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు లావు కృష్ణదేవరాయలు..

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి అసంతృప్తితోనే ఉన్నారు. ఎమ్మెల్యేలు లెక్కచేయకపోవడం, ప్రోటోకాల్ వివాదాలుండటంతోపాటు గత ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన వైసీపీలో చేరాల్సి వచ్చిందని శ్రీనివాసరెడ్డి అనుచరులు చెబుతున్నారు.
ఇక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ఉమ్మడి తూర్పుగోదావరి చాలా కీలకం. ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చిన వారు అధికారం కైవశం చేసుకుంటారు అనేది ఒక సెంటిమెంట్. గత ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. రాజకీయ ఎత్తుగడలతో రెండుచోట్ల పోటీ చేసిన వారు పార్టీ దూరం అయ్యారు. కాకినాడ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ వైసీపీ కండువా కప్పేసుకున్నారు. రాజమండ్రి బరిలో నిలిచిన మాగంటి రూప ఆ తర్వాత అడ్రస్ లేరన్నది తెలుగు తమ్ముళ్ల మాట. అమలాపురంలో బాలయోగి కుమారుడు హరీష్ ఓడిన తర్వాత నియోజకవర్గానికి రావడం లేదట.

అసలు నాయకులకే లేనప్పుడు మనకెందుకు అని టీడీపీ కేడర్ సైతం జెండా పక్కన పడేసింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అభ్యర్థుల బలాబలాలపై చర్చ నడుస్తోంది. ఈ మూడు లోక్సభ అభ్యర్థులపై టీడీపీ సీరియస్గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. చూద్దాం.. చేద్దాం.. అనే మాటలే వినిపిస్తున్నాయని.. దీంతో మరింత గందరగోళం ఏర్పడుతోంది అంటున్నారు.

గత లోక్సభ ఎన్నికల్లో కాకినాడలో 25 వేలు.. అమలాపురంలో 45 వేలు ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది. అప్పుడు కూడా చివరి వరకు నాన్చడం వల్లే నష్టపోయామన్నది టీడీపీ నేతలు చెప్పే మాట. క్లారిటీ లేక క్రాస్ ఓటింగ్ జరిగిందనేది వారి అభిప్రాయం. ఇలా ఎవరికీ వారే …… పత్తా
లేని క్యాడర్ గ ఉంది తెలుగు దేశం పరిస్థితి.

What do you think?

కనుమరుగవుతున్న తెలుగు నాటకం… సురభి.

నేరం ఉచితానిదా, సంక్షేమానిదా ? అసలు నిజం ఏంటి?