in ,

కళ్ళతో చూసినా చెప్పలేని నిజం- కథ

కళ్ళతో చూసినా చెప్పలేని నిజం- కథ

స్నేహా అయోమయంలో ఉంది. రోజంతా ఎదురింటినే చూస్తుంది. ఈ సమయంలో అటుగా వెళ్తే ఎవరైనా ఆ ఇల్లునే చూస్తారు. ఎందుకంటే 3 నెలల ముందు వరకు ఆ ఇంట్లోని కుటుంబం అప్పుల్లో మునిగిపోయింది. అందరూ వాళ్ళ పరిస్థితి అయిపోయింది అనుకున్నారు. కానీ 2 రోజుల క్రితం ఒక్క రాత్రిలో వాళ్ళ అప్పులు, వాళ్ళ కష్టాలు రెండూ తీరిపోయాయి.

అలా ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యపోయారు. దానికి కారణం ఏంటో ఎవరికీ అంతు చిక్కలేదు. అప్పటి నుంచి అందరూ ఆ ఇంటిని, ఆ ఇంట్లో వాళ్లని ఆశ్చర్యంతో చూడడం మొదలు పెట్టారు.
వాళ్ళ ఎదురింట్లో ఉండే స్నేహాకి ఏం జరిగిందో తెలిసినా ఎవరికీ చెప్పలేదు. ఒక వేళ చెప్పినా తనను ఎవరూ నమ్మరని స్నేహాకి తెలుసు. ఆ విషయం ఎప్పటికీ తనలో సమాధానం తెలిసిన ప్రశ్నగానే మిగిలిపోతుంది.
ఇదంతా 3 నెలల క్రితం మొదలైంది.

* * * *

7 ఏళ్ల ఆకాష్ ప్రతి రోజూ తన ఇంటి బయట కాళీ స్థలంలో నేలనే చూస్తూ కూర్చునేవాడు. దీన్ని చూసిన వాళ్ళ ఎదురింటి అమ్మాయి స్నేహా మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ అలా ఎందుకు కూర్చుంటున్నాడా.. అని ఆమెలో ఓ ప్రశ్న మొదలైంది.

ఒక రోజు ఆ ప్రశ్ననే ఆకాష్ ని అడిగింది. ఆ ప్రశ్నకి ఆకాష్ తలెత్తి స్నేహా మొహం చూస్తూ “డబ్బుల కోసం” అని చెప్పాడు. తను చెప్పిన సమాధానం స్నేహాకి అర్ధం కాలేదు. మళ్ళీ అడిగినా ఆకాష్ తనని అలా చూస్తూ ఉన్నాడే కానీ నోరు విప్పలేదు. ఇక చేసేదేమీ లేక స్నేహా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

కానీ ప్రతి రోజూ ఆకాష్ ని అక్కడ చూస్తుంటే తనలో సమాధానం తెలుసుకోవాలనే ఆలోచనే ప్రశాంతత లేకుండా చేస్తుంది. దీంతో ఓ రోజు రాత్రి స్నేహా ఆకాష్ ఇంటి లోపలికి వెళ్లిపోయిన తరువాత ఖాళీ స్థలంలోకి వెళ్లి ఆకాష్ కూర్చునే చుట్టు పక్కల నేలను తవ్వడం మొదలు పెట్టింది. కొంత సేపటికి తనకు మట్టిలో 50 రూపాయల నోటు ఒకటి కనిపించింది. అంతకు మించి అక్కడ ఏమీ లేదు. స్నేహాకి ఏమీ అర్ధం కాలేదు. స్నేహా తిరిగి ఆ 50 నోటుని అదే ప్లేస్ లో మట్టితో కప్పేసి వెళ్ళిపోయింది.

ఆ మరుసటి రోజు స్నేహా మళ్ళీ ఆకాష్ ని అడగడానికి వెళ్ళింది.

“ఎందుకు ఇలా రోజూ బయట కూర్చుంటున్నావు?. మట్టిలో 50 రూపాయల నోటు పెట్టింది నువ్వేనా?” అని అడిగింది.

ఈ ప్రశ్నకు ఆకాష్ స్నేహాను చూసి “డబ్బుల కోసం. ఆ 50 నోటు పాతింది నేనే. చెట్టు మొలుస్తుందనీ.. ” అమాయకమైన నవ్వుతో చెప్పాడు.

ఆ మాటలు విన్న స్నేహాకి ఎలా రియాక్ట్ అవ్వాలో, ఆకాష్ అమాయకత్వాన్ని చూసి నవ్వాలో.. బాధ పడాలో తెలియలేదు. ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

రోజులు నెలలయ్యాయి. ఇంకా ఆకాష్ అక్కడ కనిపిస్తూనే ఉన్నాడు. ఇంటి లోపల అమ్మా, నాన్న అప్పులతో బాధ పడుతున్నా.. తీర్చలేక గొడవ పడుతున్నా.. కన్నీళ్ళతో తన పిచ్చి కోరిక తీరుతుందని ఎదురుచూస్తూ ఉన్నాడు.

ఆకాష్ ని అలా చూడలేక స్నేహా అది జరగదని చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ప్రయోజనం లేకపోయింది.

* * * *

ఆ తరువాత కొన్ని రోజులకి స్నేహా ఓ అర్థరాత్రి నిద్ర పట్టక ఇంటి డాబా పైకి వచ్చింది. తల పట్టేసినట్టు ఉండడంతో ఓ సిగరేట్ వెలిగించి చుట్టూ చూసింది. చల్లటి గాలి, మైమరిపించే వెన్నెల అంతా ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో తనకు తెలియకుండానే స్నేహా చూపు ఆకాష్ ఇంటి వైపు పడింది. అప్పటి వరకు తను గమనించలేదు కానీ ఆకాష్ ఇంటి ముందు ఓ పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఇంతకు ముందు అక్కడ లేదు. అది మామూలు చెట్టు కూడా కాదు. ఆ చెట్టు కొమ్మలకు ఆకుల బదులు డబ్బుల నోట్లు ఉన్నాయి. నిద్ర మత్తులో ఊహించుకుంటున్నానేమో అని డాబా దిగి ఇంటి ముందుకు వెళ్ళి చూసింది. ఇంకా ఆ చెట్టు అక్కడే ఉంది. ఆ చెట్టుకు డబ్బు నోట్లున్నాయి. తను ఊహించుకోవడం లేదని తెలిసింది. స్నేహా ఆశ్చర్యపోయింది. అక్కడే అలా చూస్తూ ఉండిపోయింది.

ఆకాష్ కూడా అక్కడే ఉన్నాడు. ముందు స్నేహా లాగే తనూ ఆశ్చర్యపోయినా తరువాత తేరుకున్నాడు. తన కోరిక నెరవేరిందని చూసి పిచ్చి పిచ్చిగా నవ్వడం మొదలు పెట్టాడు. ఆ చెట్టు నుంచి తనకి కావాల్సినంత డబ్బు తీసుకున్నాడు. తరువాత అలాగే పిచ్చిగా నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళి అందర్నీ లేపి డబ్బు చూపించాడు.
మరో వైపు స్నేహా ఇంకా ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయింది. అక్కడున్న చెట్టు తను చూస్తుండగానే మాయమైపోయింది.

* * * *

ఆ రోజుతో ఆకాష్ వాళ్ళ అప్పులు, కష్టాలు రెండూ తీరిపోయాయి. చుట్టు పక్కల వాళ్ళకి ఇది ఎలా జరిగిందో అర్థం కాలేదు.

స్నేహా ఏం జరిగిందో కళ్ళారా చూసినా అది ఎలా నమ్మాలో తెలియలేదు. ఆ రోజు జరిగిన ఘటన తన మనసులో సమాధానం తెలిసిన ప్రశ్నగా మిగిలిపోయింది.

What do you think?

రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

రియల్ స్టార్ ఉపేంద్ర పై కేసు నమోదు