in ,

కేసీఆర్ వరాల జల్లు..గిరిజనులకు 10% రిజర్వేషన్ బంధు

కేసీఆర్ వరాల జల్లు…

హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్ర గిరిజనులపై వరాల జల్లు కురిపించారు. వారం రోజుల్లోనే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల జీవో విడుదల చేస్తామని.. త్వరలోనే గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించారు. స్వయంగా తన చేతుల మీదుగానే గిరిజన బంధు అమలు చేయనున్నట్టు వెల్లడించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల జనాభా ప్రతిపదికన ఉన్న 6శాతం రిజర్వేషనే తెలంగాణలో ఇప్పటికీ కొనసాగుతోంది. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని గిరిజనులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో గిరిజనుల జనాభా పెరిగిందని.. దానికి అనుగుణంగా రిజర్వేషన్ కూడా పెంచాలని కోరుతున్నారు. నిజానికి 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజనుల జనాభా 9.34 శాతం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వారి జనాభా 9.98 శాతంగా ఉంది. జనాభాకు తగ్గట్లుగా రిజర్వేషన్లను పెంచకపోవడంతో విద్య, ఉద్యోగాల్లో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభా మేరకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ క్రమంలోనే గిరిజన రిజర్వేషన్లపై సంచలన ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. 10శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డుకాబోదని, రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దన్న నిబంధన ఎక్కడా లేదని పేర్కొన్నారు. తమిళనాడులో 60శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ సభ ద్వారానే మరో తీర్మానం పంపుతామని, మోదీకి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే వెంటనే రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
“రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వారంలోగా జీవో విడుదల చేస్తాం. దాన్ని ఆమోదించి గౌరవాన్ని కాపాడుకుంటరా? లేకపోతే ఉరితాడుగా మార్చుకుంటరా? ప్రధాని మోదీనే తేల్చుకోవాలె.- కేసీఆర్.

ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు 6 శాతం రిజర్వేషన్లు మాత్రమే పొందారన్న కేసీఆర్.. తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తుచేశారు. కేంద్రానికి పంపి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారని ప్రధాని మోదీ, హెూంమంత్రి అమిత్ షాను సభా వేదికగా నిలదీశారు. తీర్మానం మీద రాష్ట్రపతి ముద్ర వేసి పంపిస్తే జీవో విడుదల చేస్తామని అభ్యర్థించారు.

పోడు భూములను పంచిన తర్వాత.. భూమి, భుక్తి లేని గిరిజన, ఆదివాసీల రిజర్వేషన్ అమలు చేస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి? అని మోదీ, అమితాను ప్రశ్నించారు.

తక్షణమే తాము పంపిన తీర్మానాన్ని ఆమోదించి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేస్తుందని అన్నారు
సంపదను పెంచడం, పేదలకు పంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పోడు భూముల పంపిణీకి ఇప్పటికే ఒక కమిటీ వేశామని వెల్లడించారు. ఆ కమిటీ నివేదిక మేరకు పోడు భూములను పంచుతామని స్పష్టం చేశారు. ఆ తర్వాత భూమి, భుక్తి లేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలో గిరిజనబంధు అమలు చేస్తామని, రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాస్తామని ప్రకటించారు.

ఆదివాసీ, బంజారా భవన్లు.. వారి సమస్యల పరిష్కారానికి వేదికలుగా ఉపయోగపడాలని సీఎం ఆకాంక్షించారు. గురుకులాల్లో చదువుకున్న 200 మంది గిరిజన విద్యార్థులు డాక్టర్లయ్యారని గుర్తు చేసిన కేసీఆర్.. గిరిజన బిడ్డల చదువు కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడమన్నారు. ఈ ఏడాది గురుకులాల సంఖ్యను పెంచుతామని, గిరిజన బాలికల కోసం గురుకులాలు ఏర్పాటు చేసే యోచన చేస్తున్నట్లు వెల్లడించారు.

కాగా, దేశవ్యాప్తంగా బంజారాలకు సమాన రిజర్వేషన్లు ఉండాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక.. దీనిపై ఏకీకృత విధానం కోసం పోరాడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా గిరిజనులకు మరో శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్. త్వరలోనే గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. పోడు భూముల పట్టాలు ఇచ్చిన తర్వాత.. భూమి లేని గిరిజనులను ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. పోడు భూములకు కూడా రైతు బంధు ఇస్తామని వరాల జల్లు కురిపించారు.

What do you think?

2024 రాష్ట్ర అధికార కిరీటం ఎవరిని వరించబోతుంది..

ఘరానా దొంగ కింగ్ ‘ ఫినిషర్ ‘ – మాల్యా