in ,

గ్రీస్ లో ఘోర రైలు ప్రమాదం.36 మంది సజీవదహనం

ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొని 36 మంది సజీవ దహనమయ్యారు. 85 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన గ్రీస్ లో చోటు చేసుకుంది.

ఏథెన్స్ నుంచి థెసాలోన్కి వెళ్తున్న ఓ ప్రయాణికుల రైలు తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రయాణికుల రైలుకు చెందిన తొలి మూడు బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. మరిన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి.

ప్రమాద సమయంలో ప్రయాణికుల రైలులో దాదాపు 350 మంది ప్రయాణికులున్నారు. ప్రమాద తీవ్రతకు ముందు బోగీల్లో మంటలు చెలరేగడంతో 36 మంది సజీవదహనం కాగా, 85 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు రైళ్లలో నలుగురు లోకో పైలెట్లు సహా మొత్తం ఎనిమిది మంది రైల్వే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినట్టు గ్రీక్ రైల్ రోడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెలిపారు. చీకటిగా ఉండటం, మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో సహాయకచర్యలకు ఆటంకం కలిగినట్టు అధికారులు తెలిపారు.

సమాచారమందుకున్న భద్రతాసిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. సహాయక సిబ్బంది 200 మందిని సురక్షితంగా కాపాడారు. మరికొంతమందిని సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు.

అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుండగా.. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి కారణం తెలుసుకునే దిశగా ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టిన అధికారులు రైల్వే శాఖ అధికారులను విచారిస్తున్నారు.

What do you think?

ప్రీతి మృతికి కారణమైన వాళ్ళని వదిలేది లేదు-కేటీఆర్

కరెంట్ లేకుండా పనిచేసే వాషింగ్ మెషీన్.పేదల కోసం అట