in ,

శ్రీలంక సంక్షోభం ప్రపంచ దేశాలకు ఓ హెచ్చరిక

ద్వీప దేశం శ్రీలంక లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచ దేశాలకు ఓ హెచ్చరిక గా మారింది. ఖచ్చితమైన ఆదాయ వనరులు లేకుండా అప్పులు చేస్తే ఏమవుతుందో గాడి తప్పిన శ్రీలంక పాలన చెప్పకనే చెపుతోంది. నేటికీ అక్కడ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాలేదు.

శ్రీలంక సంక్షోభం కేవలం దేశాలకే మాత్రమే కాదు. ఆర్థికంగా గాడి తప్పుతున్న వ్యక్తిగత కుటుంబ వ్యవస్థలకూ ఓ ముందస్తు హెచ్చరిక. గోరు చుట్టు మీద రోకలి పోటు లాగ,కరోనా విపత్తు ఓ వైపు శ్రీలంకను ఆర్థికంగా కుంగదీస్తే…మరో వైపు ఉక్రెయిన్, రష్యా మధ్య జరిగిన యుద్ధం చిన్న దేశమైన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పై పెద్దప్రభావం చూపించింది. వస్తు ఉత్పత్తిని ఆయా దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా వచ్చేవిదేశీ మారక ద్రవ్యం స్థభించడంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థను స్థబ్తతలోకి నెట్టింది. కరోనా కారణంగా శ్రీలంకకు వచ్చే టూరిస్టులు తగ్గి పోయారు. టూరిజం ద్వారా వచ్చే ఆదాయం ఆగిపోవడంతో ఆ దేశం కుదేలయింది. ఆ దేశానికి ఇతరత్రా తేయాకు తదితర వ్యాపార పంటలు ఉన్నప్పటికీ కేవలం టూరిజం మీద వచ్చే ఆదాయమే ప్రధాన ఆధారం. కరోనా వల్ల ప్రజలు నెలల తరబడి బయటకు రాకపోవడంతో అక్కడ టూరిజంపై ఆధారపడి బతికే వ్యాపార సంస్థలు ఉపాధి కోల్పోయారు.

ఇవన్నీ ప్రకృతి పరంగా వచ్చిన విపత్తులు కాగా, శ్రీ లంక ప్రభుత్వం విలువైన పోర్టును చైనా కు తాకట్టు పెట్టి ఆ నిధులతో ప్రభుత్వాన్ని నడపడం, అప్పులపై వడ్డీ తీర్చడానికి మళ్ళీ కొత్త గా అప్పులు చేయడం వంటి పరిస్థితులు శ్రీలంక ఖజానాను జీరో స్థాయికి తీసుకు వెళ్లాయి. అదే క్రమంలో ప్రభుత్వ బాండ్లు కూడా విక్రయించేయడం వంటి ప్రతికూల పరిస్థితులు శ్రీ లంక సంక్షోభానికి కారణమయ్యాయి. ఇంకా చెప్పాలంటే శ్రీ లంక అధ్యక్షుడు రాజపక్సే 2021లో వ్యవసాయంలో సింథటిక్ ఎరువులను రసాయన క్రిమిసంహారక మందుల వాడకాన్ని రద్దుచేశారు. సేంద్రీయ ఎరువులను ప్రవేశ పెట్టారు. ఆ క్రమంలో కోట్లాది రైతులు సేంద్రియ వ్యవసాయం పై ఆధారపడ్డారు. కానీ అది విఫలం కావడంతో శ్రీ లంక వ్యవసాయ రంగం చిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి నాశనం కావడానికి మరో కారణంగా నిలిచింది.

ఇలాంటి దుర్బర పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు దారుణంగా పడిపోయాయి. ఆకలితో అల్లాడుతున్న ప్రజల నిరసనలు ఆ దేశ అధ్యక్షుడు ప్రాణభీతితో పారిపోయే పరిస్థితికి తెచ్చాయి. నిరసన కారులు అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి, అధికార పార్టీకి చెందిన ఎంపీని చంపేయడం వంటి సంఘటనలు శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని బొమ్మ కట్టి చూపిస్తాయి.

లంక సంక్షోభం పోలికతో…
శ్రీలంక ప్రభుత్వం అనుసరించిన అసమర్థ విధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలికగా చూపిస్తూ ప్రతి పక్షాలు ధ్వజమెత్తడం తాజా విషయం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వారు చేస్తున్నఆరోపణలు…

బ్రెవరేజెస్ కార్పోరేషన్ ద్వారా విక్రయించే మద్యం ద్వారా వచ్చే లాభాలను గ్యారెంటీగా చూపించి, ఏపీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పు చేసింది. కానీ మద్యం అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయి, వడ్డీ కట్ట లేని పరిస్థితుల్లో మళ్ళీ శ్రీ లంక మాదిరి కొత్త అప్పులు చేస్తారా అని ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం మద్యం వినియోగం ఎందుకు తగ్గుతుందని ఎదురు ప్రశ్న వేయలేకపోతోంది, ఎందుకంటే ఎన్నికల ప్రచారం లో దశల వారీగా మద్యం నిషేధం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఆయన మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తున్నారు. అలా తగ్గినప్పుడు దాని మీద వచ్చే ఆదాయం తగ్గి పోతుందని, అలాంటి పరిస్థితుల్లో బకాయిలు చెల్లించ లేని స్థితిలో కార్పోరేషన్ ఆస్తులను అమ్మేస్తారని విపక్షాలు వాదించడం గమనార్హం. అలాగే ప్రైవేటు ట్రస్టుల ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం లో విలీనం చేసి, ఆ స్థిరాస్తులను తనఖా పెట్టడం ద్వారా వచ్చేఅప్పులను మళ్ళీ అప్పులు తీర్చడానికేవెచ్చిస్తారని, ఈ విధానం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని విపక్షాలు వాదిస్తున్నాయి.

అలా బకాయిలు పేరుకు పోయి, ఆస్తులను బ్యాంకులకు వదిలేసే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరించడం గమనార్హం. శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఏపీకి పోలికగా నేటికీ రాజకీయ నాయకులు కొత్త కోణంలో చేస్తున్న నిర్మాణాత్మకమైన విమర్శలు జగన్ పాలనను ప్రశ్నించడం గమనార్హం.

What do you think?

2024 ఎన్నికల వేళ పార్టీలు జిల్లాలలో వాటి బలా బలాలు

ఆగని సైకిల్ చక్రానికి … జనం సలాం