in ,

మహా నవలా రాజం – వీరగాథ– ‘పొన్నియిన్ సెల్వన్’

వీరగాథ– ‘పొన్నియిన్ సెల్వన్’

ఏదైనా విషయం తెలుసుకోవాలంటే మనకు దాని అవసరం పడాలి, నేర్చుకున్నాక గుర్తుండాలంటే ఉపయోగించాలి. ఇలా చారిత్రాత్మక చిత్రం ఏదైనా వస్తే అప్పుడు లేచి కూర్చుని అసలు చరిత్ర ఏమిటి? వీళ్లెంత మార్చేశారు అని ఆచూకీ తీయడానికి, చరిత్ర తెలుసుకుంటాం.

భారీ బడ్జెట్, రెండు భాగాలుగా వస్తున్న హిస్టారికల్ ఫిక్షన్ సినిమా “పొన్నియిన్ సెల్వం” సినిమాను ను అర్థం చేసుకోవాలంటే, ఆస్వాదించాలంటే దాని చారిత్రక నేపథ్యం కొంతైనా తెలియకపోతే కష్టం. ఇప్పుడు ఈ మణిరత్నం సినిమా ఎలా ఉన్నా, ఓ సారి చూడడానికి ఉత్సాహపడతాం. కనీసం దాని గురించి చర్చిస్తాం.
కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో, సినిమాకై నవలను సంక్షిప్తీకరించడంలో ఎన్ని పాత్రలు ఉంటాయో, ఎన్ని ఘట్టాలు ఉంచుతారో తెలియదు. పైగా చరిత్రలో లేనివాటిని నవలా రచయిత కల్పించినట్లు, నవలలో లేని కొన్నిటిని మణిరత్నం కల్పించవచ్చు. కథను, మరియు నవల విశేషాలను రేఖామాత్రంగా చెప్తాను. మొత్తం చెప్పేస్తే ఇన్ద్రస్టు పోవచ్చు.

పొన్నియిన్ సెల్వన్’ అన్న చారిత్రిక నవలను ఆర్. కృష్ణమూర్తి అన్న ప్రసిద్ధ రచయిత వ్రాసారు. ఆయన కలంపేరు ‘కల్కి’. ఆయన పేరును కల్కి కృష్ణమూర్తి అని చెబితేగానీ జనాలు గుర్తుపట్టలేనంతగా ప్రాచుర్యం చెందింది. కల్కి అన్న ఒక వారపత్రికను కూడా ఆయన స్థాపించారు. అది నేటికీ నడుస్తున్నది. ఆయన నవలలు ఆ వారపత్రికలోనే ధారావాహికంగా వచ్చేవి. ఆయన నవలలకు ఎంత డిమాండ్ ఉండేదంటే కేవలం ఆ సీరియల్ గురించి కల్కి వార పత్రిక 1950లలోనే 70వేల కాపీలకు పైగా అమ్ముడు పోయేవి. దేశంలోనే అప్పట్లో అది ఒక రికార్డు.
ఆయన వ్రాసిన చారిత్రిక నవలల్లో ముఖ్యమైనవి మూడు ‘శివగామియిన్ సపదం’, ‘పార్తీపన్ కనవు’, ‘పొన్నియిన్ సెల్వన్’ తమిళ రాజవంశాల గురించి, వారి వీర గాథల గురించి వర్ణించిన నవలలవి. చరిత్రలో దొరికిన ఆధారాలు, జానపదుల పాటల్లోని కథలు, గాథలు, బోలెడన్ని కల్పనలు కలగలిసిపోయిన చారిత్రిక కల్పనా సాహిత్యమది.

ముఖ్య పాత్రలన్నీ చారిత్రిక వ్యక్తులే అయినా చరిత్రలో కనిపించని ఎన్నో కథా పాత్రలు కూడా ఆ నవలల్లో కనిపిస్తాయి. స్వాతంత్ర పోరాట సమయంలోనూ, స్వతంత్రం వచ్చిన క్రొత్తలోనూ కల్కి రచనలు తమిళ ప్రజల్లో గొప్ప జాతీయ భావనను, పోరాట స్పూర్తిని నింపాయి.

‘పొన్నియిన్ సెల్వన్’ నవల. దాదాపు రెండువేల పేజీలకు పైగా ఉన్న మహా నవలా రాజం అది. ” క్రొత్త వరద, సుడిగాలి, మృత్యు ఖడ్గం, మణి మకుటం, త్యాగ శిఖరం” అన్న అర్థాలు వచ్చే పేర్లతో ఐదు సంపుటాలుగా వచ్చింది. అనేక పాత్రలు, పల్లవ, పాండ్య, చోళ రాజ వంశాల వ్యక్తులు, వారి సంబంధాలు, శత్రుత్వాలు కలగలిసిన అద్భుతమైన చారిత్రిక నవల. ముఖ్యంగా తరువాతి కాలంలో చోళ సామ్రాజ్యాన్ని నలుదెసలా వ్యాపింపజేసి రాజరాజ చోళుడుగా కీర్తింపబడిన అరుళ్ మొళి వర్మ, అతనికి చేదోడుగా నిలిచి ఆప్త మిత్రుడైన వందియదేవన్ ల చుట్టూ తిరిగిన కథ.
అన్ని విభిన్న పాత్రలతో ఎక్కడా విసుగనిపించకుండా, కథా గమనంలో బిగువు సడలకుండా అంత పెద్ద కథను కల్కి నడిపించిన తీరు అసామాన్యం. తమిళ నవలా రచయితలకు పాఠ్య గ్రంథం లాంటిది ‘పొన్నియిన్ సెల్వన్’.
రెండువేలకు పైగా పుటలున్న నవల కథను క్లుప్తంగా చెప్పడం కష్టమే.

 

ఐనా ఇతివృత్తం టూకీగా ఇదీ: చోళ రాజ వంశం బలపడుతున్న కాలం (సుమారుగా పదవ శతాబ్దం తొలిరోజులు). పాండ్య రాజ్యాన్ని చోళులు తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. పాండ్యవంశాకురమైన వృద్ధ రాజును, అతని ఇద్దరు కుమారులను చంపి, అమాయకుడైన అతని చిన్న సోదరుని రాజును చేస్తే అతన్ని బొమ్మని చేసి ఆడిస్తూ, రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చని ఒక వర్గం, చోళ వంశాన్ని సమూలంగా నశింపజేసి మళ్ళీ పాండ్య రాజ్యాన్ని పునరుద్ధరించాలని ఇంకొక వర్గం కుట్రలు చేస్తుంటారు.

రాజరాజ చోళుడు రాజు కాకపోవడం సహించని పాఠకులు గొడవ చేయడం వలన రచయిత ఒక ఎపిక్ వంటిది వ్రాసి తరువాతి కాలంలో జరిగిన సంఘటనల వలన ఉత్తమ చోళుని అనంతరం రాజరాజ చోళుడు రాజుగా సింహాసనాన్ని అధిరోహించడం వరకు వ్రాయవలసి వచ్చింది.

ఇదీ క్లుప్తంగా కథ. దీనిని చదివి ఆనందించ వలసిందే కానీ చెప్పడం కుదరని పని. ఈ నవలకు కనీసం నాలుగైదు మంచి ఆంగ్లానువాదాలు ఉన్నాయి. నాకు తెలిసి పవిత్రా శ్రీనివాసన్ అనువాదం ఉత్తమమైనది. సి. వి. కార్తిక్ నారాయణన్ అనువాదం కూడా బాగానే ఉంటుంది. అమెజాన్లో పుస్తకాలు దొరుకుతున్నాయి. కిండిల్ స్టోర్లో కూడా ఉన్నాయి.

What do you think?

ఈడి, సిఐడి, ఐటీలు ప్రభుత్వ రాజకీయ బ్రహ్మాస్త్రాలా?

వీడిన ఛాయ సోమేశ్వరాలయం మిస్టరీ….