in

మన్నధుడ్ని మసి చేసిన సిరివెన్నెల “చలువ”      

సిరివెన్నెల

సిరివెన్నెల “చలువ”

సినీ గేయ సాహిత్యంలో నిందా స్తుతి ప్రక్రియకు అద్దం పట్టిన పాట ఇది.సిరివెన్నెల సినిమా కోసం “ఆదిభిక్షువు వాడినేది కోరేది” అంటూ సీతారామ శాస్త్రి ఈ పాట రాసి మెప్పించారు. మంచివాళ్ళకు ఏదో ఒక లోపం సృష్టించే నిన్ను ఏం అడుగుతాం అనడం సున్నితమైన ఆరోపణకు ప్రతీక. మధుర స్వరాలతో గొంతెత్తి కూసే కోకిలమ్మకు నల్లని రూపాన్ని ఇచ్చిన నిన్ను ధైర్యంగా ఏమడగగలను అనడం శివుడి పేరిట చేసే ప్రకృతి నివేదన. “శ్రుతి హితంగా పాడి జన హృదయాల్లో స్థానం పొందిన నాకు చూపులేకుండా చేశావు” అనడం పాటలో అంతర్లీనంగా ఒదిగిన వస్తువు. ఒక ప్రామాణిక మైన ఉదాహరణను ప్రతిపాదిస్తూ దాన్ని బలంగా సమర్థించడం తర్కం.ఆ లక్షణం ఈ పాటలో ప్రకాశిస్తుంది. రచనలోని పోలికలు విన్నపుడు శ్రోత మనసు ‘ అవును కదా’ అని పులకిస్తుంది.

పార్వతితో శివునికి వివాహం చేయడం ద్వారా కలిగే తనయుడుని రాక్షస సంహారానికి సంసిద్ధం చేయాలన్న ఆలోచనకు మన్మధుడు ఒప్పుకుంటాడు. ఆ గమ్యంలో…అక్కడ యోగముద్రలో ఉన్న శివుడిని మేల్కొలిపేందుకు అతనిపై పూల బాణం వదులుతాడు. అంతే ఖిన్నుడైన శివుడు ఉగ్రుడై ముందూ వెనకా ఆలోచించకుండా తన మూడో కన్నుతో మన్మధుడిని మసి చేస్తాడు. ముందూ, వెనకా ఆలోచించని అలాంటి ముక్కోపి శివుడిని ఏమి అడిగేది అనడం ప్రతీకాత్మక పురాణ కథనం. అయితే మన్మథుడుని శివుడు భస్మం చేయడం వెనుక ఉన్న పురాణ గాథ తెలియకపోతే ఈ పాటలోని తార్కిక ప్రతీభను ఆస్వాదించలేం. ఆ సంగతి పాట వినక ముందే తెలిస్తే ‘ఆనందో బ్రహ్మ’ అంటూ పులకితమవడం మన వంతు అవుతుంది. ఈ పాట నిందా స్తుతితో పాటు ఓ ప్రవచనంలా ఆథ్యాత్మికతను కూడా ప్రతిపాదిస్తుంది. ఇది రచనలోని బహుముఖ ప్రతిభకు అద్దం పడుతుంది. ఆ అద్దం ఏ కాలధర్మానికీ చెదిరిపోనిది.

What do you think?

ఎక్సర్ సైజు తో పనిలేకుండా బరువు తగ్గండిలా…

వెన్నెలకంటి

మాస్టారు గారి రచనలు: వెన్నెలకంటి పాటపై దుమారం