in ,

మాస్టారు గారి రచనలు: వెన్నెలకంటి పాటపై దుమారం

వెన్నెలకంటి

వెన్నెలకంటి పాటపై దుమారం

సినీ గేయ రచయిత వెన్నెలకంటి తొలి నాళ్ళలో రాసిన ఆ కవితపై చాలా రోజుల తర్వాత పెద్ద దుమారమే చెలరేగింది!! ఆధునిక సాహిత్యంలో తీవ్ర చర్చను రేకెత్తించింది, అవును నిజం… సినిమా రంగంలోకి రాక ముందు వెన్నెల కంటి తన కవితా వ్యాసంగంలో భాగంగా ఓ మంచి కవితను రాశారు. ఆ కవిత ఏంటంటే…

 

“చిరునవ్వుల వరమిస్తావా

చితి నుంచి లేచొస్తాను

మరుజన్మకు కరుణిస్తావా

ఈ క్షణమే మరణిస్తాను” .

 

ఈ కవిత ఆ రోజుల్లో కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో జరిగే ఫేర్ వెల్ సందర్భాల్లో చోటు చేసుకునేది. ఆ సందర్భాలలో నేలపై ముగ్గులు వేసి అందులో ‌లవ్ సింబల్ వేసి ఆ సింబల్ మధ్యలో ఈ కవితలోని ఆ రెండు పంక్తులు రాసి, విద్యార్థులు తమ ప్రేమను వెల్లడించేవారు. ప్రేమలోని గాఢతకు ఆ కవిత చక్కని

ప్రతీక. “నవ్వు”అనే మాటను చితికి అనుసంధించి చెప్పడం వల్ల ఈ కవిత ఓ ప్రయోగవాద కవితగా జనహృదయాలలో గాఢ ముద్ర వేసింది. అంతేకాదు ఈ కవిత పూర్తి పాఠం 1993లో విడుదలైన “చిరునవ్వుల వరమిస్తావా” అనే సినిమాలో శోక గీతంగా బాలూ గొంతులో శ్రోతలను అలరించింది. అయితే సినిమా పాటలో చిన్న మార్పు చేశారు. చితి నుంచి లేచొస్తాను అనే చోట చితి నుంచి బతికొస్తాను అని చిన్న మార్పు చేశారు. మిగిలింది అలానే ఉంచేశారు.

కానీ ఒకానొక సందర్భంలో జనార్థన మహర్షి అనే రచయిత ఆ కవిత తాను రాశానని వెన్నెలకంటిది కాదని చెప్పుకొచ్చారు. ఆ విషయం పత్రికల్లో కూడా వచ్చింది. ఆ రోజుల్లోనే దీనిపై వెన్నెల కంటి వివరణ ఇస్తూ ఆ కవిత తాను రాసిందేనని పత్రికా ముఖంగా స్పష్టం చేశారు. జనార్థన మహర్షి తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సందర్భంలో నా కవితను సంగ్రహించాడని, అది అతని స్వీయకవిత కాదని అది నాదేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇంకో ఆధునిక కవి ఒకరు ఈ వివాదంలో జోక్యం చేసుకుంటూ వెన్నెల కంటి రాసిన “చిరునవ్వుల వరమిస్తావా” కవిత ఇంగ్లీష్ పొయెట్రీలో వచ్చిన ఓ పోయెంలోని కొన్ని పంక్తులకు అనువాద రూపమని చెప్పారు. కానీ ఆ మూలాన్ని ఆయన రుజువు చేయలేకపోయారు. ఇలా ఓ వారం పాటు దీనిపై చర్చ నడిచింది. ఈ కవిత ఎవరి సొంతం అనే సందేహం నాడు పత్రికల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక దశలో చాలామంది వెన్నెలకంటి ఇంగ్లీష్ కవితల నుంచి కాపీ కొట్టారా అని అనుమానం వ్యక్తం చేశారు కూడా. కానీ చివరికి వారి ఆరోపణలు రుజువు కాకపోవడంతో ఆ కవిత వెన్నెలకంటి స్వీయ రచనగానే గుర్తింపు పొందింది.

మరో విషయం ఏమిటంటే… వెన్నెలకంటి నెల్లూరు లో స్టేట్ బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తున్నప్పుడే ఈ కవితను రాశారు. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో గుర్తుచేశారు. ఒక స్టేట్ బ్యాంకు ఉద్యోగి సినిమా రంగంలోకి తరలి వెళ్ళి, తేనె పలుకుల ఆధునిక వచన కవిగా, తెలుగు సినీ రంగంలో పాటల కవిగా, అనువాద చిత్రాలకు మాటల రచయితగా పురోగమించి బహుముఖ ప్రక్రియలలో రాణించడం అరుదైనవిషయం. అది ఓ సంచలనం కూడా.

What do you think?

సిరివెన్నెల

మన్నధుడ్ని మసి చేసిన సిరివెన్నెల “చలువ”      

ఐఆర్సిటిసి కొత్త నిభందనలు.ఇక ట్రైన్ లో బుకింగ్ కష్టమే!