in ,

సిరివెన్నెల పాట వెనుక రహస్యం ఏంటి?

సిరివెన్నెల పాట వెనుక రహస్యం

“విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం” పాటతో సీతారామ శాస్త్రి సినీ గేయ ప్రస్థానం ప్రారంభమయింది. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన “సిరివెన్నెల”(1986) సినిమాతో ఇది సాధ్యమయింది. ఇది ఆయనకు తొలి పాట. అంతే కాదు ప్రతిష్టాత్మక” నంది” పురస్కారం ‌తెచ్చిన పాట. సృష్టి గుట్టు విప్పుతూ ప్రకృతిలోని అందాలను వాస్తవంలోకి తర్జుమా చేస్తూ సాగే ఈ పదబంధాలు అలౌకిక అనుభూతిని కలిగిస్తాయి. ఎక్కడో దూరం నుంచి ఈ పాట వింటే ” ఇందులో ఏదో ఉంది” అనిపిస్తుంది.

అది ఏమిటనేది అర్థం కాదు. అలౌకికమైన (అవాస్తవం) ఒక విషయాన్ని శాబ్ధిక సౌందర్యంతో లౌకిక సమాజానికి అనుసంధానించి ఆ మేరకు ” ఇది నిజమే” అనిపించడం ఓ సాహిత్య కళ. ఈ పాట అలాంటి కళనే వెల్లడించింది. సత్యం, అలౌకికం మధ్య దోబూచులాడే మనసును ఒక జవాబు దొరకని అచేతనావస్థకు గురి చేస్తూనే చివరికి ” ఇది నేననుకున్నదే” అనిపించడం ఈ పాటలో దాగి ఉన్న మర్మం. కవిత్వం ఎపుడూ బహిరంగ వచనం కాదు‌. మాటలా సూటిగా ఉండదు.లోతైన గుండెతో నడుస్తుంది, ఏదో దాస్తుంది. అలా దాచక పోతే అది కవిత్వం కాదు. ఈ పాటలో అలాంటి లక్షణం దాగి ఉండడం వల్ల విలక్షణ గీతంగా నిలిచింది. సిరివెన్నెలగా వెలిగింది. ఈ పాటలో నిబిడీకృతమైన ప్రకృతి అనే వస్తువు పాట చివరి దాకా వశపరుచుకుని ఉంటుంది.

“ప్రాగ్ధిశ వీణియపైన…దినకర మాయూఖ తంత్రులపైన జాగృత విహంగతకులే వినీల గగనపు వేదికపైన”అనే చరణం వస్తువైవిధ్యంతో ప్రయోగ శీల దృక్పథాన్ని చెబుతుంది. దిక్కు రూపం లేనిది. మనం భావిస్తేనే అది తూర్పు దిక్కు అయింది. కాని దినకరునికి( సూర్యుడు) రూపం ఉంది. ఆ వెలుగుకు ఆచ్ఛాదన కావాలంటే ఆ దిక్కును వీణగా మార్చాలి. అందుకే అది ప్రాగ్ధిశ వీణియ అయింది. మన ఊహకు వదిలేసిన ఆ వీణే ప్రకృతి కాంత. వెలుగులీనే సూర్య కిరణాలే ప్రకృతి పురుషుడు. ఆ కిరణాల స్పర్శలో వీణియ పులకించగా నీలాకాశ వేదికపై పక్షుల గుంపులు అప్పుడే కళ్ళు తెరిచాయనే అర్థం ఇందులో ప్రతి ఫలించి సృష్టిలోని పాంచభౌతిక సంబరాన్ని బయట పెడుతుంది.

అసలు తూర్పు దిక్కూ (వీణీయ), సూర్యుడు వేరు వేరు కాదు. ఆ దిక్కే మూలధాతువుగా దినకరుడు ఉదయిస్తాడు. అంటే ఈ మహా సృష్టికి ప్రకృతే ఆధారం అని ఈ పంక్తులు వివరిస్తాయి. సృష్టి ప్రాభవాన్ని అలా కాకపోతే ఇలా, ఎలాగైనా ఆపాదించుకోవచ్చనే వైనం ఈ పాటకు సైద్ధాంతిక భూమికను తెచ్చింది. ఈ సందర్భంలో సూర్యుడు ముందా ? తూర్పు దిక్కుముందా?అన్న ప్రశ్న తలెత్తినప్పుడు తాత్విక వివేచనలో ” రెండూ ఒకటే” అనిపిస్తుంది.ఈ భావం అంతా “అర్ధనారీశ్వర తత్వం ” అన్న ఎరుకను కలిగిస్తుంది.

What do you think?

rajinikanth

రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించబోతున్నారా..?

స్మృతి “పదం” అల్లూరి సినిమాలో “శ్రీ శ్రీ” త(ఒ)ప్పు