in ,

మంచిని పంచుతూ..మనిషికి సాయపడుతూ.. జీవించిన సౌందర్య

సౌందర్య

సినీ ప్రపంచంలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూవెళ్తుంటారు కానీ పేరుతో పాటు తమకంటూ ఒక స్థాయిని పొంది ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే వారు చాలా తక్కువ. అలా ఆకట్టుకునే నటనతో గొప్ప వ్యక్తిత్వంతో అందరి ఆదరణ పొందిన వారిలో నటి సౌందర్య కూడా ఒకరు.

కర్ణాటకలోని ముల్బాగల్కు చెందిన రచయిత-నిర్మాత అయిన కె.ఎస్.సత్యనారాయణ మరియు మంజుల దంపతులకు జన్మించారు సౌందర్య. అయితే పుట్టిన సంవత్సరాన్ని కొన్ని మీడియా సంస్థలు సరిగ్గా తెలుపడంలో విఫలం కావడంతో ఆమె ఏ సంవత్సరంలో జన్మించిందో అన్న విషయంపై ఎవరికీ సరైన స్పష్టత రాలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ఆమె 18 జూలై,1976లో జన్మించిందని కొన్ని ప్రచురణలలో పేర్కొనడంతో అదే సరైన సంవత్సరం అని చాలా మంది నమ్ముతారు. 1992లో గంధర్వ చిత్రంతో తొలిసారిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సౌందర్య 1993లో దర్శకులు ఎస్.వి.కృష్ణ రెడ్డిగారు రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కించిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ తరువాతి కాలంలో అమ్మోరు,అంతఃపురం,రాజా, అన్నయ,శ్రీ మంజునాథ లాంటి ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువైన ఆమె తెలుగు సినీ పరిశ్రమకు దొరికిన మరో సావిత్రగా అందరి మనసుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం దక్కించుకున్నారు. అలా తన 12 ఏళ్ల సినీ జీవితంలో దాదాపుగా 100 సినిమాలలో నటించి అందరి అభిమానం పొందారు.

సినిమాలలో నటిస్తూనే ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అదేవిధంగా అనాధ పిల్లలకు మంచి చదువు చెప్పించి వారికి మెరుగైన భవిష్యత్తు అందించాలనే భావనతో బెంగుళూర్లో 3 స్కూళ్లను నిర్మింపచేసారు. కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే తపనతో ఎల్లపుడూ వీలైనంత వరకు ఇతరులకు సహాయపడటంలో సౌందర్య అందరి కంటే ఒక అడుగు ముందే ఉండేవారట. 2003లో జి.ఎస్.రఘు అనే వ్యక్తిని పెళ్లాడారు సౌందర్య. కానీ జీవితంలో ప్రతి క్షణం మనం అనుకున్నట్టు జరగదని కాలం సౌందర్య జీవితం రూపంలో మరోసారి నిరూపించింది.

తనకు పెళ్ళైన ఏడాది తరువాత 17 ఏప్రిల్,2004లో భా.జ.పా కి మద్దతు తెలుపుతూ అదే సంవత్సరం ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూర్ నుంచి కరీంనగర్కు సౌందర్య,ఆమె సోదరుడు అమర్నాథ్ హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో వారి ప్రాణాలు కోల్పోయారు. తెలుగు సినీ పరిశ్రమలోనే సౌందర్య మరణించిన ఆ రోజు ఒక విషాదకరమైన రోజుగా నటీనటులుకు మరియు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.

సౌందర్య మరణించినప్పటికీ నలుగురికి సహాయపడాలనే ఆశయం బ్రతికే ఉండాలనే ఉద్దేశంతో ఆమె తల్లి మంజుల అమర్ సౌందర్య విద్యాలయ అనే పేరు మీద మరిన్ని పాఠశాలలు, అనాధాశ్రమాలు మరియు సంస్థలను ప్రారంభించింది. సౌందర్య చనిపోయి ఎంతో కాలం అయినప్పటికీ ఆమె నటన,ఆ వ్యక్తిత్వం అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది.

What do you think?

బీజేపీ కత్తెరలో కేసీఆర్, జగన్ ఇరుక్కుంటారా?

బుర్ర కథ లోని సందర్భోచిత కథనం.. రచయితల కోసం