పోలీసు ప్రాణాలు తీసిన ఇసుక మాఫియా..
ఇసుక మాఫియా ఓ పోలీస్ ప్రాణం తీసింది. అక్రమ తవ్వకాలు చేసి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను ఆపబోయిన పోలీసును ట్రాక్టర్ తో తొక్కించి ప్రాణాలు తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే మైసూర్ చౌహాన్ (51) కర్ణాటకలోని నెలోగి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా తనిఖీల నిమిత్తం నారాయణపుర గ్రామంకు వెళ్ళిన మైసూర్ చౌహాన్ అక్రమంగా ఇసుక తరలిస్తోన్న ఓ ట్రాక్టర్ ను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ను ఆపకపోగా పోలీసు పైకి ట్రాక్టర్ ను పోనిచ్చాడు. దీంతో చౌహాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుర్ఘటన పై కలబురి పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ “ఈ ఘోరానికి పాల్పడిన డ్రైవర్ ను అరెస్టు చేశాం. డ్రైవర్ ఆ ట్రాక్టర్లో ఇసుక తరలిస్తున్నారు. ఆ సమయంలో కానిస్టేబుల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ ట్రాక్టర్ ను ఆపడానికి ప్రయత్నించగా.. ట్రాక్టర్ ఆపకుండా ఆయన మీద నుంచి పోనివ్వడంతో ప్రాణాలు కోల్పోయారు.” అని వెల్లడించారు. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ ఘటనపై స్పందిస్తూ. “ఇసుక మాఫియా పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం. వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం” అని అన్నారు.