in ,

తెలుగు మిస్టరీ స్టోరీ వర్ణ – చాప్టర్ 2 – విక్రమ్

తెలుగు మిస్టరీ స్టోరీ వర్ణ – చాప్టర్ 2 – విక్రమ్

ఆ ఆకరాలు చీకటిలో కలిసిపోయిన తరువాత విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. తను ముందు గమనించలేదు కానీ తన చేతి మణికట్టు దగ్గర నరం బాగా కోసుకుపోయింది. దాని వల్ల రక్తం ధారగా కారుతూ రోడ్డుపై ధారిలా మారుతుంది.

విక్రమ్ తన పోకెట్ (pocket) లో నుంచి ఓ కర్చీఫ్ తీసి గాయం అయిన చోట కట్టుకోబోయాడు. కానీ ఎందుకో అది మనికట్టుని చేరేలోపే మధ్యలో ఆగిపోయింది. విక్రమ్ నడకని ఆపి ఆ కర్చీఫ్ ని గట్టిగా పట్టుకుని అలా చూస్తూ ఉండిపోయాడు. తనకు తెలియకుండానే కళ్లు కన్నీళ్ళతో నిండిపోయాయి. తన నోటి నుంచి కూడా ఏదో మాట బయటకి రావలని పెదాల దగ్గరే ఆడుతుంది.

విక్రమ్ మాత్రం ఆ మాటని, కన్నీళ్లని బయటకి రానివ్వకుండా అనిచి లోపలే ఉంచుతున్నాడు. కానీ మనసుకి, మైండ్ కి జరుగుతున్న ఆ పోరాటంలో మనసు గెలవక తప్పలేదు. ఇక తన కన్నీళ్లు ఆగలేదు. తన్నుకుంటూ వచ్చిన్న ఆ కన్నీళ్ళ వెంటే అతని నోట్లో మెదులుతున్న మాట కూడా బయటకి వచ్చింది.

“అమ్మా…” అంటూ మోకాళ్ళ మీద పడి ఏడవడం మొదలు పెట్టాడు. అతని కంటి నుంచి వచ్చే ప్రతి కన్నీటి బొట్టు తనలో దాచుకున్న జ్ఞాపకాల్ని, బాధని బయటకి తన్నేస్తుంది.

కొన్ని నెలల క్రితం

సండే, ఉదయం 10:20 నిమిషాలు

కిచెన్ లో అమ్మ టిఫిన్ వేస్తుంటే విక్రమ్ పక్కన నిల్చుని ఆ మాట ఈ మాట చెబుతూ మధ్య మధ్యలో అవసరం అయినప్పుడు సాయం చేస్తున్నాడు. ప్రతి సండే అలా అమ్మ పక్కన ఉండి మాటలు చెప్పడం, ఆ రోజులో కొంత సమయం తనతో పంచుకోడం విక్రమ్ కి అలవాటు.

అమ్మ దోసెలేస్తుంది. తను చేసే వంటల కోసం వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఎగబడతారు. కానీ విక్రమ్ మాత్రం అమ్మ ఏం చేసినా ఏదో ఒకటి తక్కువ అయిందని వంకలు పెడుతుంటాడు. అందరి ఇంట్లో జరిగేది ఇదే కదా.

ఇప్పుడు కూడా అదే గోల.. తనకు వేసిన దోసెలు సరిగ్గా కాలలేదు. చట్నీలో సరిపడా ఘాటు లేదు. “అయితే ఇక నుంచి నువ్వే వేసుకోరా..” అని అమ్మ ఇంకో దోసె విక్రమ్ ప్లేట్ లో పెట్టింది.

“ఇంకెందుకు వేస్తున్నావు? బాగోలేదని చెప్పాకదా..” అన్నాడు కొంచెం చిరాకుగా.

“ఇలా ఇవ్వు” అని అమ్మ విక్రమ్ చేతిలో ప్లేట్ తీసుకుంది.

“ఏంటి?” అన్నాడు విక్రమ్.

“నేను తినిపిస్తా” అంది అమ్మ.

“నువ్వు తినిపిస్తే టేస్ట్ ఎలా మారుద్దే” అన్నాడు.

“ఆ.. అను” అని చిన్న అట్టు ముక్క తుంపి చట్నీ అద్ది విక్రమ్ కి తినిపించింది.

విక్రమ్ ముందు అయిష్టంగానే నోరు తెరిచాడు. కానీ ఒకసారి నోట్లో పెట్టుకున్న తరువాత తనకి అది చాలా నచ్చింది. ఆ మృదువైన అట్టు ముక్క, దాంట్లో కొబ్బరి పచ్చడి లోని పులుపు, పచ్చిమిర్చిలోని ఘాటు, నమిలెలోపే నాలుక మీద కరిగిపోతున్న కొబ్బరి..

ఆ రుచితో మైమరచిపోతూనే “ఇందాక బాలేదు?” అన్నాడు.

“ఇప్పుడు బాగుందిగా.. ” అంది అమ్మ.

తనకు తినడం రాలేదో, లేక అది అమ్మ ప్రేమో విక్రమ్ కి అర్దం కాలేదు కానీ ఆ రుచి మాత్రం తన కడుపుతో పాటు మనసును కూడా నింపేసింది.

ఇంతకు ముందు అమ్మ చేత్తో ఎన్నో సార్లు తిన్నా.. ఈ సారి కొత్తగా, ఇంకా రుచిగా అనిపించింది. ఎన్ని సార్లు తిన్నా ఇదే ఫీలింగ్ వస్తుందేమో..

ఆ రెండో రోజు

ఉదయం – 8 గంటలు

విక్రమ్ ఆఫీస్ కి రెడీ అవుతున్నాడు. నాన్న న్యూస్ చూస్తున్నారు. అమ్మ కూడా టీవీ చూస్తూ పనిచేస్తోంది. తను మామూలుగా అంత ఉదయాన్నే ఎప్పుడూ టీవీ చూడదు.

“ఏంటి అమ్మ గారు ఇంత పొద్దున్నే టీవీ చూస్తున్నారు? పని కట్టుకుని..” అన్నాడు విక్రమ్.

” అటు చూడు..” అంది అమ్మ.

“అంతలా చూడడానికి ఏముంది..” అని విక్రమ్ టీవీ చూశాడు. న్యూస్ లో ఎవరో అమ్మాయిని చంపేశారని చెబుతున్నారు.

“ఎవరో అమ్మాయిని రాత్రి పూట నరికి చంపారంట రా.. పొద్దునే వాళ్ళ పేరెంట్స్ ఇంటికొచ్చి చూస్తే తెలిసిందంట.” టీవీలో చూపిస్తున్న న్యూస్ ని వివరించారు నాన్న.

“లవ్ చేయలేదని లవరో, పెళ్లి చేసుకోలేదని ప్రియుడో చంపేసుంటారు లే నాన్న. రోజుకి ఎన్ని చూడట్లేదు.” విక్రమ్ విషయాన్ని ఈసీగా తీసుకుంటూ అన్నాడు.

“అలా ఎలా చంపుతారురా? అసలు ఆళ్లు మనుషులేనా?!” హంతకుడి క్రూరత్వానికి ఆశ్చర్యపోతూ అడిగింది అమ్మ.

“కత్తితో.. పీక పరపరా కోసి..” అన్నాడు విక్రమ్.
” ఆపరా.” అంది అమ్మ.

“సర్లే నేను వెళ్తున్నా. ఏమైనా అవసరం అయితే కాల్ చేయండి.” అని విక్రమ్ ఆఫీసుకి బయలుదేరాడు.
విక్రమ్ ఒక క్రైం రిపోర్టర్. జాబ్ లో జాయిన్ అయ్యి 1 year అవుతోంది. తన స్కిల్ తో అందర్నీ మెప్పించి తక్కువ టైం లోనే మంచి పొజిషన్ కి కెళ్ళాడు.

ఆ రోజు ఆఫీస్ లో చాలా బిజీగా గడిచిపోయింది. ఇంటికెళ్ళే సరికి రాత్రి 7 అయ్యింది. అమ్మానాన్న మార్నింగ్ విక్రమ్ వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. నాన్న టీవీ చూస్తూ, అమ్మ పని చేస్తూ.

“ఏంటి? మీ టీవీ చూడడం ఇంకా అవ్వలేదా?” అన్నాడు విక్రమ్.

” వచ్చావా.. రా.. పొద్దున ఓ అమ్మాయి చనిపోయింది కద. ఆ చుట్టు పక్కల్లోనే ఇంకా ఎవరో చనిపోయారట.”

“అబ్బా.. మార్చండి డాడీ.. నా పనిలోనే క్రైం అనుకుంటే ఇక్కడ కూడా క్రైమేనా..” అన్నాడు విక్రమ్.

తను చెప్పడమే నాన్న చానెల్ మార్చేశారు.

“కాఫీ ఇవ్వనా..?” విక్రమ్ చేతిలో బ్యాగ్ తీసుకుంటూ అంది అమ్మ.

“ఇవ్వు. కానీ చక్కర ఎక్కువ వెయ్యకు” అన్నాడు.

అమ్మ కాఫీ పెట్టడానికి వంట గదిలోకి వెళ్ళింది.

నాన్న మార్చిన ఛానెల్ కూడా న్యూస్ ఛానలే.. దాంట్లో కూడా అదే న్యూస్.
(టీవీ లో) యాంకర్: ఒక్క రాత్రిలో రెండు హత్యలు. అవి జరిగింది కూడా ఒకే ప్రదేశంలో.. ఎవరు చంపారు? ఎందుకు చంపారు? పోలీసులు ఏమంటున్నారు? .

“అన్ని ఛానెల్స్ లో ఇదే కొట్టుడా.. సినిమా ఏదైనా పెట్టండి డాడీ” అంటూ విక్రమ్ వెళ్ళి సోఫాలో నాన్న పక్కన కూర్చున్నాడు.

ఆ తరువాత ఇంకో వారం రోజులలో ఇలాంటి 8 హత్యలు జరిగాయి. విక్రమ్ ఇంటి నుంచి ఆఫీస్ వరకు ఎక్కడ చూసినా ఆ హత్యల గురించే. కానీ ఆ న్యూస్ ని తన ఛానెల్లో వేరే రిపోర్టర్స్ కవర్ చేస్తుండడంతో విక్రమ్ ఆ న్యూస్ ని టచ్ చేయలేదు.

ఓ రోజు ఉదయం విక్రమ్ లేవగానే కాఫీ కోసం అమ్మని పిలిచాడు. అమ్మ పలకలేదు. హాల్లో కెళ్ళి చూశాడు. అక్కడ లేదు. కిచెన్ లోకెళ్ళి చూశాడు. అక్కడా లేదు. నాన్న కూడా ఎక్కడా కనిపించడం లేదు. విక్రమ్ మనసులో ఏదో తెలియని కంగారు మొదలైంది. తను నడిచే వేగం పెరిగింది. బెడ్ రూం, బాత్రూం ఇలా ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్ వెతికేసాడు. ఎక్కడా కనిపించలేదు. బయట కూడా కనిపించలేదు. విక్రమ్ గుండె చప్పుడు పెరిగింది. “అమ్మా.. అమ్మా..” అని అరుస్తూ బాక్ యార్డ్ కెళ్ళాడు. అక్కడ అమ్మ మౌనంగా కూర్చుంది.

“అమ్మా.. పిలుస్తుంటే పలకవేంటి? ” అని అరిచాడు విక్రమ్.

” ఎందుకు రా అరుస్తున్నావు. ” అని అడిగింది అమ్మ.

“నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు? అవును డాడీ ఏరి?” అని అడిగాడు విక్రమ్.

” మన పక్క వీదిలో డాడీ ఫ్రెండ్ వర్మ అంకుల్ ఉన్నారు కద. ఆయన్ని ఎవరో చంపేశారు. డాడీ అక్కడికే వెళ్లారు.” అంటూ కొంచం దిగులుగా చెప్పింది అమ్మ.

” అవునా..?! నన్ను లేపల్సింది కద.” అని అన్నాడు విక్రమ్.

“నిన్నటి వరకు ఎక్కడో లే అనుకున్నా కానీ.. ఇప్పుడు మన పక్క వీధిలో కూడా జరిగింది అంటే భయం వేస్తుంది రా విక్రమ్.” అని మనసులో భయాన్ని బయట పెట్టింది అమ్మ.

విక్రమ్ తన దగ్గరకు వెళ్ళి “ఏమీ కాదులే అమ్మా.. నేనున్నాను. నాన్న కూడా ఎప్పుడూ నీ పక్కనే ఉంటారు. లే.. లోపలికి వెళ్దాం.” అని అమ్మ చెయ్యి పట్టుకుని లేపి ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. విక్రమ్ అమ్మకి దైర్యం చెప్పాడు కానీ తన మనసులో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఓ చిన్న భయం ఉంది.

ఇంకో అరగంట తరువాత

ఉదయం 8 గంటలు

విక్రమ్ పక్క వీదిలో మర్డర్ జరిగిన ఇంటికి వెళ్ళాడు. ఇంటి బయట రోడ్డు మనుషులతో నిండిపోయుంది. పోలీసులు లోపలికి రానివ్వకపోయినా జనం లోపల ఏం జరుగుతుందో చూడాలని తెగ ప్రయత్నిస్తున్నారు.

విక్రమ్ ఆ గుంపులో అతికష్టం మీద ఇంటికి దగ్గరగా వెళ్ళ గలిగాడు. విక్రమ్ నాన్న లోపల పోలీసులతో మాట్లాడుతున్నారు.

” నాన్న.. నాన్న..” అని అరిచాడు. విక్రమ్ ని గమనించిన నాన్న పోలీసులను నుంచి విక్రమ్ దగ్గరకు వచ్చారు.

“ఇక్కడకి ఎందుకు వచ్చావు? ఇంటి దగ్గరే ఉండక పోయావా..” అన్నారు నాన్న.

” ఎవరు చంపి ఉంటారు? ఏమంటున్నారు పోలీసులు?” అని అడిగాడు విక్రమ్.

” చాలా ఘోరంగా చంపరురా. పేగులు బయటకి వచ్చేసినీ. అడ్డంగా నరికేశారు.” అంటూ ఆ దారుణాన్ని వివరించారు నాన్న.

” ఆంటీ..”

“లేదు. నిన్న మార్నింగ్ ఊరెల్లారంట.” అని విక్రమ్ ప్రశ్నకు సమాధనం ఇచ్చారు నాన్న.

” సరే.. నాకు ఆఫీస్ లో కొంచెం పనుంది. మీరు ఇంటికి వెళ్లొచ్చుగా.. అమ్మ భయపడుతుంది.” అని విక్రమ్ ఆఫీస్ కి బయలుదేరాడు. నాన్న ఇంటికి వెళ్ళిపోయారు.

సిటీలో ఎక్కడ చూసినా ఈ మర్డర్స్ గురించే చర్చలు జరుగుతున్నాయి. విక్రమ్ ఆఫీస్ లో అయితే అది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఈ గందరగోళంలో విక్రమ్ తన పని మీద కాన్సంట్రేట్ చేయలేకపోయాడు. ఆ రోజు ఎన్ని సిగరెట్స్ కాల్చాడో లెక్కలేదు.

ఇక ఆ వత్తిడి తట్టుకోలేక తన కేసును పక్కన పెట్టి ఆ మర్డర్స్ మీద కాన్సంట్రేట్ చేశాడు. మర్డర్స్ జరగడం మొదలైన డేట్ నుండి ఇప్పటి వరకు హత్యలకు సంబంధించి వచ్చిన అన్ని న్యూస్ ఆర్టికల్స్ ని తిరగేసాడు. వరుసగా 11 హత్యలు, విక్టింస్ మధ్య కనెక్షన్ లేదు, మర్డర్స్ లో పాటర్న్ కనిపించ లేదు, వాళ్ళ మోటివ్ ఏంటో ఇంకా స్పష్టంగా తెలీదు.

విక్రమ్ గంటలు తరబడి అన్ని న్యూస్ పేపర్స్ చూశాడు. మర్డర్స్ లో సీక్వెన్స్ కనిపెట్టడానికి ట్రై చేశాడు. ఈ మద్యలో నిమిషానికి ఒక సిగరెట్ కాల్చాడు. కానీ ఎంత వెతికిన తనకి సాలిడ్ గా ఏమీ దొరకలేదు. జస్ట్ డెడ్ ఎండ్.

ఆ రోజు ఆ కేసు ఎటూ తేలక తల పట్టుకుని, తన పనిని పూర్తి చేసుకునే సరికి రాత్రి 1 అయ్యింది. ఇక ఇంటికి వెళ్దాం అని బండి తీసి స్టార్ట్ చేశాడు, కానీ బండి స్టార్ట్ అవ్వలేదు. ఎన్ని సార్లు కిక్ కొట్టినా స్టార్ట్ అయినట్లే అనిపించింది కానీ స్టార్ట్ అవ్వలేదు. తరవాత చూస్తే పెట్రోల్ లేదు. వచ్చేటప్పుడు పెట్రోల్ కొట్టించడం మర్చిపోయాడు.

బండిని అక్కడ ఉంచేసి “ఊబర్” బుక్ చేయడానికి ట్రై చేశాడు. అదీ బుక్ అవ్వలా. బయటకి వచ్చి ఆటోల కోసం చూశాడు. అతి కష్టం మీద ఒక ఆటో దొరికింది.

విక్రమ్ ఇంటికి కొంచెం ముందే దిగిపోయాడు. ఆ పక్కన కట్టేస్తానికి రెడీగా ఉన్న ఓ షాప్ లో కెళ్లి ఓ సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాడు.

దాంట్లో నుంచి ఓ సిగరెట్ తీసి వెలిగించుకుని ఇంటి వైపుగా నడిచాడు.

రోడ్డంతా నిశబ్దంగా ఉంది. చల్లటి గాలి, కాలుతూ స్వేచ్ఛ నిస్తున్న సిగరెట్. రోజంతటిలో ఈ క్షణం ప్రశ్నతంగా అనిపించింది విక్రమ్ కి.

అలా నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. బయట లైట్లు ఇంకా వేసే ఉన్నాయి. ఇంటి లోపల మాత్రం చీకటిగా ఉంది. అమ్మానాన్న పొడుకుని ఉంటారని అనుకున్నాడు విక్రమ్.

“అమ్మా.. అమ్మా..” అని పిలిచాడు. ఎవరూ పలకలేదు.

మళ్లీ “అమ్మా..” అని గట్టిగా అరిచాడు. ఈ సారి “ఆ.. వస్తున్నా” అని సమాధానం ఇచ్చి లోపల లైట్ వేసింది అమ్మ.

ఈ లోపు ఒక్క సారిగా ఏదో కింద పడినట్లు శబ్దం వచ్చింది.

“అమ్మా.. ” అని విక్రమ్ మళ్ళీ పిలిచాడు. ఈ సారి సమాధానం రాలేదు. మళ్లీ మళ్లీ పిలిచాడు. ఎవరూ పలకలేదు.

డోర్ ని తోశాడు. డోర్ ఆల్రెడీ తీసే ఉంది. వెనక్కి నెట్టి “అమ్మా..” అని పిలిచాడు. తన కళ్ల ముందు డోర్ కి అడ్డంగా అమ్మ కింద పడి పోయింది. కిటికీ లో నుండి ఎవరో బయటి దూకి పరిగెట్టినట్లు శబ్దం వినిపించింది. విక్రమ్ కి ఏమీ అర్ధం కాలేదు. తన కళ్ళు ఒక్కసారి ఎడమ వైపుకి తిరిగాయి. అమ్మ బాడీ ఉంది కానీ తల కనిపించలేదు.

“అమ్మా…….” అని పిచ్చి పట్టిన వాడిలా అరిచి మోకాళ్ళ మీద పడ్డాడు. తన కళ్ళ ముందు ఇంట్లో కొంచం దూరంలో అమ్మ తల కనిపించింది.

విక్రమ్ అరుపుకి “ఏమైందిరా…” అంటూ నాన్న కంగారుగా బయటకి వచ్చారు. తల మొండెం వేరైనా అమ్మ కనిపించింది. నాన్న అక్కడే కుప్పకూలిపోయారు.

విక్రమ్ అరుపు తరువాత తన కంటిలో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. నోట మాట రాకుండా అలా చూస్తూ ఉండిపోయాడు.

What do you think?

సినిమాలు చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు

మొరాకోలో భూకంపం. 2 వేల వేల మంది మృతి