గత జన్మ గురించి చెబుతూ ఆశ్చర్య పరుస్తున్న బాలుడు
గత జన్మ, పునర్ జన్మ అన్న మాటలు సినిమాల్లో వినే ఉంటారు. పెద్ద వాళ్లు అప్పుడప్పుడు ‘చచ్చి నీ కడుపున పుడతా’ అనడం కూడా వినుంటారు. కానీ అవి నిజమేనా.. అంటే మాత్రం ఎవరిదగ్గర సరైన సమాధానం ఉండదు. కొందరు తమకు గత జన్మ గుర్తుందని అన్న వార్తలు పేపర్ లో వచ్చినా అంతగా పట్టించుకోము. కానీ ఒకవేళ చిన్న బాలుడు తను పుట్టకముందు జరిగిన ఘటనలు కూడా జరిగింది జరినట్లు జెబితే నమ్మకుండా ఉంటామా..?! ఇప్పుడు ఇలాంటి ఓ ఘటనే ఉత్తర్‌ప్రదేశ్ లోని మైన్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఎలావూ పోలీస్టేషన్ పరిధిలోని మంగల్‌పూర్ గ్రామంలో 8 ఏళ్ల ఆర్యన్ అనే బాలుడు తన తల్లితో జూన్ 15న రతన్‌పూర్ గ్రామానికి వెళ్ళాడు. ఆర్యన్ తల్లి ఆర్యన్ను వెళ్లి తన అమ్మమ్మ నీరజ్ మిశ్రా కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోమని చెప్పింది. అయితే ఆర్యన్ తను తన అమ్మమ్మ కాదని.. తన భార్య అని.. తను మళ్ళీ పుట్టానని చెప్పి ఆశీర్వాదం తీసుకోడానికి నిరాకరించాడు. ఇంతకు ముందు కూడా ఆర్యన్ ఇలాగే ప్రవర్తించినా చిన్న పిల్లాడు ఏదో మాట్లాడుతున్నాడులే అని వదిలేసిన కుటుంబ సభ్యులకు ఈ సారి తను పుట్టక ముందు విషయాలను కూడా జరిగింది జరిగినట్లు చెప్పాడు.
ఆర్యన్, తను గత జన్మలో మనోజ్ మిశ్రా (నీరజ్ మిశ్రా భర్త) అని.. ఎనిమిదేళ్ళ క్రితం అంటే 2015 జూన్ 9న పొలానికి వెళ్లిన తను నీళ్ళు పోతున్న రంధ్రాన్ని మూసేద్దాం అని ప్రయత్నించినప్పుడు ఓ పాము కాటేసిందని.. తనను ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్య దారిలోనే చనిపోయాని చెప్పుకొచ్చాడు. ఆఖరికి కేవలం నీరజ్ మిశ్రా (ఆర్యన్ అమ్మమ్మ)కు మనోజ్ మిశ్రా (ఆర్యన్ తాత)కు మాత్రమే తెలిసిన విషయాలను కూడా పూస గుచ్చినట్లు చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. దీంతో అప్పటి వరకు తన మాటలు పట్టించుకోని కుటుంబ సభ్యులు ఈ మాటలు విన్నాక ఆర్యన్ను నమ్మక తప్ప లేదు.
మరో పక్క ఆర్యన్ పునర్జన్మ కథ నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. ఇప్పటి వరకు గత జన్మ, పునర్ జన్మల గురించి నమ్మని వారు కూడా ఆర్యన్ గురించి తెలుసుకుని ఆశ్చర్యంతో నోళ్ళు వెల్లబెడుతున్నారు.