in

కాంగ్రెస్ లో గులాంనబీ రాజీనామాకు అసలు ‘కారణం’?

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా వెనుక అసలు కారణం పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఎ.ఐ.సి.సి.ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీలో సంప్రదింపుల తతంగం అనేదే లేకుండా పోయిందని, ఏదైనా విషయం చెప్పాలంటే రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించరనేది గులాం నబీ ఆజాద్ చేసిన ఆరోపణ. రాహుల్ గాంధీ వల్ల పార్టీ నాశనమయిందన్న ఆయన మాటల్లో ఇక కాంగ్రెస్ బతకదు అనే సంకేతాన్ని ఇచ్చారాయన. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ బలం చతికిలపడినప్పుడే కేంద్ర ఎన్టీయే ప్రభుత్వానికి మరో మిఠాయి బుట్ట దొరికినట్లు అయింది. ఆ ప్రతికూల ప్రభావం, ఇటు పార్టీలో సీనియర్ల అభిప్రాయాలకు విలువలేక పోవడం వంటి అంశాలు ఆజాద్ రాజీనామాకు కారణంగా చెప్పుకుంటున్నారు.

దీనికి తోడు పార్లమెంటు లో ఆజాద్ ను ప్రధాని మోడీ పొగడ్డం కూడా ఆయనను కాంగ్రెస్ ను వీడేటట్టు చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ఎవరికీ ముందుగా తెలియకుండా చేస్తున్న అప్రకటిత “ఆకర్ష్”గా ఈ వ్యవహారాన్ని అభివర్ణిస్తున్నారు. ఆజాద్ సొంత పార్టీ పెడతారన్నది ఒక రాజకీయ ఎత్తుగడగానే అనుమానిస్తున్నారు. అటు కుటుంబ రాజకీయ వారసత్వం పై మక్కువతో సీనియర్లను ప్రోత్సహించకపోవడం మరోవైపు, పార్టీ చాలా రాష్ట్రాల్లో చతికిలపడ్డం వంటి అంశాలు ఆయన్ను కాంగ్రెస్ ను వీడేటట్టు చేశాయని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే కేంద్ర ఎన్టీయే ప్రభుత్వానికి రాజ్యసభలో బలంలేక ఎన్నో కీలకమైన బిల్లులు వీగి పోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే బీజేపీకి సొంత బలంపై రాజ్యసభ సభ్యులు నామినేట్ కావాలి.

అలా జరగాలంటే వివిధ రాష్ట్రాలలో బీజేపీ ఎమ్మెల్యేల బలం పెరగాలి. అప్పుడే వాళ్ళు ఉభయ సభల్లో తిరుగులేని విజేతలు అవుతున్నారు. అక్కడ బీజేపీ గెలవాలంటే కొన్ని చోట్ల అడ్డుగా ఉన్న కాంగ్రెస్ ను(కాంగ్రెస్ కూటమి) పక్కకు తప్పించాలి. అంటే కాంగ్రెస్ చేసిన తప్పుల్ని అదే పార్టీ నుంచి బయటకు వచ్చిన వారితో చెప్పిస్తే ప్రజలు నమ్ముతారు కనుక ఎన్డీయే ఈ తరహా ఆకర్షణ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అసమ్మతులను ఎన్నికల ప్రచారంలో వాడుకోవడంతో వచ్చిన విజయాలతో వారికే రాజ్యసభ లో స్థానం కల్పించాలన్నది ఎన్టీయే వ్యూహంగా అనుమానిస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలవడంలో కూడా ఇలాంటి మర్మమే ఉన్నట్లు భావిస్తున్నారు.

What do you think?

67 Points
Upvote Downvote

ఇకపై ఓ.టి.టిలో విడుదల అసాధ్యమా….?

రంగ రంగ వైభవంగా – రివ్యూ