మేరీ సెలేస్టే
1872, డిసెంబర్ 5వ తేదీన కెప్టెన్ డేవిడ్ మోర్ హౌజ్ తన సిబ్బందితో న్యూయార్క్ నుంచి జెనోవకు వ్యాపార నావలో వెళ్తుండగా పోర్చుగల్ లోని అజోరెస్ కు 740 కిలోమీటర్ల దూరంలోని తీర ప్రాంతంలో తనకంటే యెనిమిది రోజుల ముందే గమ్యం చేరుకోవాల్సిన తన స్నేహితుడి నావ సముద్రంలో వదిలేయబడి కనిపించింది. ఆ నావలో ఎవరూ కనిపించకపోవడంతో కెప్టన్ డేవిడ్ వెంటనే తన సిబ్బందిని నావను పరిశీలించడానికి పంపాడు. అసలేమైందో తెలుసుకోవడానికి వెళ్లిన సిబ్బందికి నావ మొత్తం చెక్కు చేదరకుండా కనిపించింది.
కానీ నావలో ఉండవలసిన లైఫ్ బోట్, మార్గదర్శకాలు తెలియ చేసే వస్తువులూ కనిపించక పోవడంతో పాటు వత్తిడిని కొలిచే రెండు పైపులలో ఒకటి విడతీసి కనపడగా,1700 బ్యారెల్ల మద్యం మాత్రం భద్రంగా కనిపించాయి.నావకు 3 అడుగుల లోతు నీళ్లు పైకి వచ్చినప్పటికీ,అంత తక్కువ శాతం నీళ్ళు నావకు హాని కలిగించే అవకాశం లేదు.అయితే నావలో ఉండాల్సిన కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్,తన భార్య సార ,కుమార్తె సోఫియా మరియు ఏడుగురు సిబ్బంది కనిపించకుండాపోయారు.ఏమైందో తెలియని అయోమయంతో కెప్టెన్ డేవిడ్ ఆ నావను కూడా తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు.
1861వ సంవత్సరంలో కెనడాలోని నోవా స్కోషియాకి చెందిన స్పెన్సర్ ఐలాండ్లో అమెజాన్ అనే నావ తయారు చేయబడింది.మే 18,1861న ఆ అమెజాన్ నావ ప్రయాణించినప్పటి నుండి ఎన్నో అడ్డంకులను ఎదురుకుంది.మొదటి సారి సముద్రంలోకి ప్రయాణించినప్పుడే ఆ నావను నడుపుతున్న కెప్టెన్ న్యుమోనియాకి గురై అనారోగ్యంతో చనిపోయాడు.ఇలా ఎన్ని సార్లు సముద్రంలో ప్రయాణించిన ఏదోక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఆలా ఒక సంవత్సరం తరువాత ఆ నావను అమెరికాకు చెందిన రిచర్డ్ W.హైన్స్ అనే వ్యక్తి కొనుగోలు చేసి మేరి సెలేస్టే గా పేరు మార్చారు.ఎంత మంది చేతులు మారినా సరే ఆ నావను కొన్న వారు, నడిపిన వారు ఏదోఒక ప్రమాదానికి గురవతూనే ఉన్నారు.
ఏదేమైనా ఆ నావలో ప్రయాణించిన కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్ కి మిగిలిన సభ్యులకు ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నించారు.కొంత మంది వారి ఆలోచనలకు తగ్గట్టు సిద్ధాంతాలను ప్రతిపాదించారు.వారిని గ్రహాంతరవాసులు
అపహరించారని కొంతమంది, సముద్రంలోని ఏదో ఒక జీవి చంపిందని కొంతమంది అనగా, సముద్ర దొంగలు చంపారని మరి కొందరన్నారు.నావలో దెయ్యం ఉందని పుకారు కూడా పుట్టించారు.
ఇంకొందరు నావలో వస్తున్న నీరుని చూసి భయపడి కెప్టెన్ బెంజమిన్ మిగిలిన వారు లైఫ్ బోట్ తీసుకుని వెళ్ళిపోయుంటారని ఇలా ఎవరికి తోచిననట్టు వారు సొంత సిద్ధాంతంలో కథను రక్తి కట్టిస్తున్నారు. ఏదేమైనా అసలు ఆ రోజు నావలో ఉన్న వారికి ఏం జరిగిందో ఎవరికి అంతు చిక్కకుండాపోయింది.
కేవలం లైఫ్ బోట్ మార్గదర్శకాలు తెలియ చేసే వస్తువులూ మాత్రమే ఎందుకు కనిపించకుండా పోయాయి?వారిది ప్రమాదమా? హత్య? అసలేం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ రహస్యంగానే మిగిలింది.