జర్నలిస్ట్స్ అందరికీ ఇళ్ల స్థలాలిస్తాం – కేటీఆర్
తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఇళ్ల స్థలాలు అందించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు మెడపట్ల సురేష్, షేక్ మోయిజ్ మాట్లాడుతూ సమాజహితమే లక్ష్యంగా పనిచేస్తున్న రిపోర్టర్స్ కు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇది వరకే ప్రకటించిందని.. సీఎం కేసీఆర్ కూడా ఎన్నికల సమయంలో రిపోర్టర్స్ కు ఇళ్ల స్థలాలపై పలుమార్లు లేవనెత్తారని.. కానీ స్పష్టమైన హామీ ఇవ్వలేదని అన్నారు.
మరోవైపు శనివారం మంత్రి కేటీఆర్ తో సమావేశమయిన ఢిల్లీ టీయూడబ్ల్యూజే-143 అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేష్ అధ్యక్షతన పాత్రికేయుల బృందం ఢిల్లీలో పని చేస్తున్న తెలంగాణ పాత్రికేయులందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయాలపై మంత్రి కేటీఅర్ సానుకూలంగా స్పందించారు. హైదారాబాద్ లోని జర్నలిస్ట్స్ అందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందులోనే ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయుల్ని సైతం చేరుస్తామని తెలిపారు.
ఈ మేరకు జీవోలో ఆ అంశాలను పొందుపరుస్తామన్న కేటీఆర్ జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకి, హైదరాబాద్ పాత్రికేయులకు ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పనులను అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణకు అప్పగించారు.