జనసేన,టీడీపీ కలిసే పోటీ.. అధికారికంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీలో రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఆయన్ను అరెస్ట్ ప్రభుత్వం కక్షసాధింపు మాత్రమేనని ఇటు ప్రతిపక్షాలు, అటు ప్రజలు మండి పడుతున్నారు.
మరో వైపు ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక నుంచి రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వంపై పోరాటం చేస్తాయని ప్రకటించారు.
వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరం జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ లు సమావేశం అయ్యారు. వారి మధ్య 40 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. అనంతరం బయటకువచ్చి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విడివిడిగా పోటీ చేస్తే ఏపీలో అరాచక పాలనే మళ్లీ రాజ్యమేలుతోందన్నారు. తాము అవినీతిపై చేసే ఈ పోరాటంలో బీజేపీ కూడా తమతో కలిసి రావాలని కోరారు.
రేపటి నుంచి (శుక్రవారం, సెప్టెంబర్ 15) టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యచరణ ఉంటుందని తెలిపారు. అవినీతి ప్రభుత్వంతో పోరాడే ప్రతీ కార్యక్రమంలో రెండు పార్టీలు కలిసే పాల్గొంటాయని జనసేన అధినేత పవన్ ప్రకటించారు.