అప్పు మీ జీవితానికే కాదు, ప్రాణాలకు కూడా ప్రమాదమే!
అవసరం మనిషికి ఏదైనా నేర్పిస్తుందటారు కానీ అదే అవసరం ఏ పనైనా చేయిస్తుంది అని కూడా అంటారు. అవసరం విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. మనం చేసే పని తప్పో ఒప్పో కూడా ఆలోచించనివ్వదు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఊహించనివ్వదు.
భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టు మనిషి అవసరాలు, డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అవసరాలు తీర్చుకోవడం కోసమే అప్పును ఆశ్రయిస్తారు. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే అవసరాల్లో ఉన్న ఆడవారిని ఎంచుకొని, మైక్రో ఫైనాన్స్ వ్యాపారులు వారికి వల వేస్తున్నారు. ఈ అవసరాల నిమిత్తమో లేక అనారోగ్య సమస్యల వల్లనో ఏదో ఒక కారణాలతో తమకు తెలియకుండానే అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. అప్పు తీర్చలేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడడమే కాకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ప్రతి అవసరానికి కారణాలు ఉన్నట్టే, ప్రతి సమస్యకి దారులు కూడా ఉంటాయి, అది అప్పే అవునక్కర్లేదు. ప్రాణ సమస్య కన్నా మరో ముఖ్యమైన సమస్య అనేది ఉండదు, దానికి కూడా ఏదో ఒక విధానం ఉంటుంది. ఆరోగ్య సమస్య వస్తే కేవలం కార్పొరేట్ హాస్పిటల్స్ కు పరుగు పెడతారు, కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అంతే కాకుండా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు కూడా తమ వంతు సహాయాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఒకవేళ అప్పు చేయాల్సి వచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా తీసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ జీవితాలే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు కూడా కాపాడబడతాయి.
ముఖ్యంగా మహిళలు అప్పు విషయాల్లో మీరు ముందు ఉండకండి, అది మీ జీవితానికే కాదు, మీవారి ప్రాణాలకు కూడా ప్రమాదం.