ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్హావాల్ కు చెందిన ప్రతిభా తప్లియాల్ అనే ఓ గృహిణి 13వ నేషనల్ సీనియర్ ఉమెన్స్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ లో “గోల్డ్ మెడల్” ను సాధించారు. థైరాయిడ్‌తో పోరాడుతున్నప్పటికీ ధృడ సంకల్పంతో ముందుకు సాగిన ఆమె జాతీయ బాడీబిల్డింగ్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని “ఆహా” అనిపించారు.
ఇటీవల ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రత్లామ్ లో నేషనల్ సీనియర్ ఉమెన్స్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతిభా తప్లియాల్ రెండోసారికే గోల్డ్ మెడల్ సాధించి అందర్ని ఆశ్చర్యపరిచారు.
గత 5 సంవత్సరాల నుంచి ఆమె థైరాయిడ్ తో బాధపడుతున్నాన ఆమె 2018లో థైరాయిడ్ లెవెల్ 5 నుంచి 50కి పెరిగాయని చెప్పారు. డాక్టర్లు తనకు వర్కౌట్ చేయాలని సలహా ఇవ్వడంతో తన భర్త భూపేష్ తో కలిసి స్థానిక జిమ్ లో చేరారని తెలిపారు. కొన్ని నెలల్లోనే 30 కేజీలు తగ్గినట్లు పేర్కొన్నారు.
ఇక గత సంవత్సరం సిక్కింలో మొదటిసారి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్న ఆమె ఉత్తరాఖండ్ తరపున మొదటి మహిళా ప్రొపెషనల్ బాడీ బిల్డర్ గా పాల్గొన్నారు. కాగా, తాను మొదటి సారి బాడీ బిల్డింగ్ ప్రారంభించినప్పుడు చుట్టు ప్రక్కల ఉన్న మహిళలు తనను ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడు వారి అంచనాలను తలకిందులు చేస్తూ గోల్డ్ మెడల్ సాధించానని నవ్వుతూ చెప్పారు. భర్త భూపేష్ తన కండరాల్లు, ప్రతిభను గుర్తించి బాడీ బిల్దింగ్ పోటీల్లో పాల్గొనాలని ప్రోత్సహించారని తెలిపారు. ఆ ప్రోత్సాహంతోనే ఇంత వరకు రాగలిగానని అన్నారు.
రిషికేష్ లో స్కూల్, కాలేజీ చదువుతున్న రోజుల్లో ఆమె వాలీబాల్, క్రికెట్ ఆడేవారని అన్నారు. పెళ్ళికి ముందు స్టేట్ లెవెల్ వాలీబాల్ టీమ్ కు నాయకత్వం కూడా వహించారని, దాని ఫలితంగానే ఆమె పాల్గొన్న రెండోసారికే బంగారు పతకాన్ని సాధించారని చెప్పుకొచ్చారు.
ప్రతిభా తప్లియాల్ ఇద్దరు పిల్లలు(15, 17 సంవత్సరాలు) డెహ్రాడూన్ లో 10, 12 తరగతులు చదువుతున్నారు. ప్రతిభా ప్రస్తుతం ఏషియన్ మరియు వరల్డ్ చాంపియన్ షిప్ కు సన్నద్ధమవుతున్నారు.